ఆర్థిక సంవత్సరం 2021-2022కి సంబంధించి ఐటీఆర్(ITR) ఫైల్ చేసేందుకు జులై 31ని గడువుగా నిర్ణయించారు. అయితే, పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి చివరి క్షణం వరకు వేచి ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా గడువును ప్రభుత్వం పొడిగించవచ్చని కొందరు పన్ను చెల్లింపుదారులు ఊహిస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ పరిస్థితులు, కొత్తగా ప్రారంభించిన ఆదాయపన్ను పోర్టల్‌లో అవాంతరాలతో ఐటీఆర్ ఫైలింగ్, ఇతర ఆదాయపన్ను సంబంధిత విషయాలకు గత రెండు సంవత్సరాల్లో గడువు పొడిగించారు. 2022 జులై 2న, ఆదాయ పన్ను శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో.. ఆదాయపన్ను పోర్టల్‌లోని ఇర్రెగ్యులర్ ట్రాఫిక్‌ని ఎదుర్కోవడానికి సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ ఇన్ఫోసిస్ ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకుంటోందని తెలిపింది.
ఐటీ శాఖ చేసిన ట్వీట్‌లో.. ‘ఐటిడి ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించాం. పోర్టల్‌లో ఇర్రెగ్యులర్ ట్రాఫిక్‌ను గుర్తించినట్లు ఇన్ఫోసిస్ సమాచారం ఇచ్చింది. దీన్ని సరిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కొంతమంది వినియోగదారులకు అసౌకర్యం ఎదురుకావచ్చు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం’ అని పేర్కొంది.
* నిపుణులు ఏమంటున్నారంటే..
SAG ఇన్ఫోటెక్ MD అమిత్ గుప్తా ఓ ట్వీట్‌లో..‘ఆదాయపన్ను శాఖ తన పోర్టల్‌లో ఇర్రెగ్యులర్ ట్రాఫిక్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వెబ్‌సైట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. ఐటీఆర్‌లను దాఖలు చేయడానికి గడువును పొడిగించాలని పన్ను శాఖ యోచిస్తోందని దీని అర్థం. కొత్త వెబ్‌సైట్ ప్రారంభించి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం గడిచినా, పోర్టల్‌లో ట్రాఫిక్‌ను నిర్వహించలేకపోవడం కొంత దురదృష్టకరం. అయినప్పటికీ, ఎక్కువ మంది అసెస్‌లు ముందుగానే ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఈ పరిస్థితి ఎదురై ఉండవచ్చు. ఐటీఆర్ ఫారమ్‌లు, యుటిలిటీలు ఈ సంవత్సరం చాలా ముందుగానే విడుదల అయ్యాయి. కాబట్టి ఈ సంవత్సరం పొడిగింపు అవసరం ఉండకపోవచ్చు. పోర్టల్ సక్రమంగా పని చేయనప్పుడు పన్ను చెల్లింపుదారులు అవసరమైన ఫైలింగ్‌లను చేయలేకపోతే డెడ్‌లైన్‌ను CBDT పొడిగించవలసి ఉంటుంది.’ అని చెప్పారు.
గుప్తా సచ్‌దేవా & కో, చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో భాగస్వామి గౌరవ్ గుంజన్ మాట్లాడుతూ..‘మహమ్మారి ప్రభావం నుంచి దేశం ఇంకా కోలుకుంటోంది. ఆర్థిక సంవత్సరం 20-21 కోసం ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు ఇటీవలి 2022 మార్చి 15 నాటికి పొడిగించారు. ఆదాయ పన్ను శాఖ ప్రచురించిన డేటా ప్రకారం, 2022 జులై 31 వరకు దాఖలు చేయవలసిన 7.5 కోట్ల ఐటీఆర్‌లలో 2022 జులై మొదటి వారంలో 99.20 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో 21 రోజులలోపు దాదాపు 6.5 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ చేయబడటం అసంభవంగా కనిపిస్తోంది. ఆదాయపన్ను పోర్టల్ కూడా నిరంతరం సాంకేతిక లోపాలను ఎదుర్కొంటోంది. వీటిని డిపార్ట్‌మెంట్ స్వయంగా ట్వీట్‌లో అంగీకరించింది. పోర్టల్ సజావుగా పని చేసి, గడువును కనీసం 1 నెల పొడిగించకపోతే, పన్ను చెల్లింపుదారులు గడువును పాటించడం చాలా కష్టమైన పని. కాబట్టి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆదాయ పన్ను శాఖ పరిగణనలోకి తీసుకుంటుందని, రిటర్న్ ఫైలింగ్ తేదీని కనీసం ఒక నెల పొడిగించవచ్చని భావిస్తున్నాం’ అని విశ్లేషించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, IT Returns, ITR, ITR Filing