ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఆదాయాన్ని(Income) మించి సంపాదించేవారు చట్ట ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాలి. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు, పరిమితులను చట్టాలు(Act), ప్రభుత్వ సంస్థలు వెల్లడిస్తాయి. నిర్ణీత తేదీ లోపు ఇన్కమ్ ట్యాక్స్(ITR) రిటర్న్ ఫైల్ చేయపోతే.. వారు చట్టప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆలస్య రుసుము లేకుండా ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి గడువు తేదీ జులై 31 వరకు ఉంది. ప్రస్తుతానికి ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ గడువును పొడిగించే ప్రతిపాదన లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం దాటి ఆదాయం పొందే ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి. కానీ ప్రభుత్వం నిర్దిష్ట వ్యక్తులకు, ప్రధానంగా సీనియర్ సిటిజన్లు లేదా సూపర్ సీనియర్ సిటిజన్లకు కొన్ని మినహాయింపులు అందిస్తోంది.
FY 2021-22 నుంచి 75 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లు(Senior Citizen)ఆదాయ పన్ను చట్టం, 1961లో నిర్వచించిన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే.. ITR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్థిక చట్టం- 2021 ద్వారా ప్రభుత్వం ఆదాయ పన్ను చట్టం- 1961లో కొత్త సెక్షన్ 194Pను యాడ్ చేసింది. ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం నుంచి సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఇవ్వడానికి కొన్ని షరతులను ఈ సెక్షన్ నిర్వచించింది. కొత్త సెక్షన్ 194P అనేది 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ నుంచి సూపర్ సీనియర్ సిటిజన్లకు ఏ పరిస్థితుల్లో మినహాయింపు లభిస్తుందో చూద్దాం..
1. సీనియర్ సిటిజన్ వయసు 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
2. సీనియర్ సిటిజన్ మునుపటి సంవత్సరంలో మన దేశంలో నివసించి ఉండాలి.
3. సీనియర్ సిటిజన్‌కు పెన్షన్ ఆదాయం, వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయ వనరుగా ఉండాలి.
4. అతను/ఆమె పింఛను పొందుతున్న అదే బ్యాంకు నుంచి వచ్చిన/ఆర్జించిన వడ్డీ ఆదాయాన్ని లెక్కల్లో చూపించాలి.
5. నిర్దేశించిన ఫార్మాట్లో తమ ఆదాయ వివరాలను ధ్రువీకరించి, పేర్కొన్న బ్యాంకుకు డిక్లరేషన్‌ను అందించడం తప్పనిసరి.
రిటర్న్ ఫైల్ చేసేందుకు గడువు పెంచుతారా..?
2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి గడువు తేదీ 2022 జులై 31. సంపాదిస్తున్న వ్యక్తులు ఈ గడువు తేదీలోగా తమ ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి. ఆగస్టు 1 నుంచి రిటర్న్ ఫైల్ చేసేవారు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తుది గడువు పొడిగింపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాబట్టి పన్ను చెల్లింపుదారులు IT రిటర్న్‌ను సకాలంలో దాఖలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, ITR Filing, Senior citizens, Tax benefits