కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు శుభవార్త. పెన్షన్ తీసుకునేవారు జీవించే ఉన్నారని ధ్రువీకరించే జీవన ప్రమాణ పత్రాన్ని (Life Certificate) ఇకపై పోస్టాఫీసులోనే అందించనున్నారు. పింఛనుదారులు, సీనియర్ సిటిజన్లకు ఇది పెద్ద ఉపశమనం. ఎందుకంటే ఇంతకుముదు ఈ సర్టిఫికెట్ కోసం వారు బ్యాంకులకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో ఈ జీవన ప్రమాణ పత్రాన్ని పొందడానికి గత ఎంప్లాయర్ వద్దకు కూడా వెళ్లాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో దాదాపు 60 లక్షల మంది కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ విషయాన్ని ఇండియా పోస్ట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. "ఇకపై వృద్ధులు సులభంగా జీవన ప్రమాణ సేవలను పొందవచ్చు. సమీప పోస్టాఫీసులో ఉండే సీఎస్సీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి" అని పోస్టల్ విభాగం ట్వీట్ చేసింది.
జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్ సైట్ jeevanpramaan.gov.inలో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. "ఈ జీవన ప్రమాణ పత్రాన్ని పొందడానికి, పెన్షన్ విత్డ్రా తీసుకునే వ్యక్తి వ్యక్తిగతంగా ఫించన్ పంపిణీ ఏజెన్సీ ముందు హాజరు కావాలి. లేదా వారు ఇంతకు ముందు పనిచేసిన సంస్థ జారీ చేసిన లైఫ్ సర్టిఫిక్ట్ కలిగి ఉండాలి. అనంతరం దాన్ని పంపిణీ ఏజెన్సీకి అందజేయాలి" అని వెబ్సైట్ పేర్కొంది. అయితే తాజా ప్రకటనతో ఈ ప్రక్రియ సులభతరం కానుంది.
ఇప్పుడు పింఛనుదారులు జీవణ ప్రమాణ పత్రం కోసం పెన్షన్ పంపిణీ ఏజెన్సీ లేదా వారు పనిచేసిన సంస్థకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందుకు బదులుగా వారు సమీప పోస్టాఫీసును సందర్శించవచ్చు. పోస్టాఫీస్ లేదా పెన్షన్ ఏజెన్సీకి వెళ్లడం కష్టమైనవారు సమీపంలో ఉన్న జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. ప్రభుత్వ ఫించనుదారుల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను భద్రపరిచే వ్యవస్థ ఉంది. మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ద్వారా ఇలాంటి సమస్యను పరిష్కరించనున్నారు. జీవన్ ప్రమాణ్ సెంటర్ల ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు ఉపయోగించుకోవాలని పోస్టల్ విభాగం సూచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pension Scheme