news18-telugu
Updated: November 4, 2020, 12:20 PM IST
Bank of Baroda కస్టమర్లకు గుడ్ న్యూస్... ఆ ఛార్జీలు రద్దు
(ప్రతీకాత్మక చిత్రం)
లిమిట్‌కు మించి చేసే క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్స్ ఛార్జీలను తొలగిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. నాలుగైదు రోజులుగా బ్యాంకులు వసూలు చేస్తున్న డిపాజిట్, విత్‌డ్రాయల్ ఛార్జీలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. క్యాష్ డిపాజిట్, విత్డ్రాయల్స్పై బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త ఛార్జీలను ప్రకటించింది. కస్టమర్లు తమకు ఇచ్చిన లిమిట్‌కు మించి క్యాష్ డిపాడిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు గతంలో ప్రకటించింది. ఆ ఛార్జీల వివరాలు చూస్తే మెట్రో, అర్బన్ ప్రాంతాల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్లు నెలలో మూడు కన్నా ఎక్కువసార్లు డిపాజిట్ చేస్తే ప్రతీ డిపాజిట్‌కు రూ.50 చొప్పున ఛార్జీలు చెల్లించాలి. ఇక రూరల్, సెమీ అర్బన్ కస్టమర్లు రూ.40 చొప్పున ఛార్జీలు చెల్లించాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రమే కాదు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇలాంటి ఛార్జీలనే నవంబర్ 1 నుంచి వసూలు చేస్తోంది. ఇక యాక్సిస్ బ్యాంక్ ఆగస్ట్ నుంచే క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్ ఛార్జీలను వసూలు చేస్తోంది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఛార్జీలను వసూలు చేయడంపై విమర్శలు వచ్చాయి. కస్టమర్లతో పాటు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుండటంతో బ్యాంక్ ఆఫ్ బరోడా దిగివచ్చింది. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని గతంలో జారీ చేసిన సర్కులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
ఈ పరిణామాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. జన్ ధన్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ ఉన్నవారి నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయట్లేదని ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవీ ఛార్జీలను పెంచలేదని ప్రకటించింది.
సాధారణంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇవి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. కాబట్టి మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
Published by:
Santhosh Kumar S
First published:
November 4, 2020, 12:20 PM IST