దేశీయ విమానయాన సంస్థల (Airlines)పై ధరల పరిమితుల (Price caps)ను తొలగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆ తేదీ తర్వాత కొన్ని రూట్స్‌లో ఫ్లైట్ ఛార్జీలు తగ్గనుండగా, మరికొన్ని రూట్లలో మాత్రం ఛార్జీ (Charge)లు పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో దేశ విమానయాన సంస్థలు ప్రయాణికుల ఛార్జీలను నిర్ణయించడంలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటాయి. ఖరీదైన ఇంధనం వల్ల టికెట్(Ticket) ధరలు తగ్గకపోయినా.. తక్కువ డిమాండ్ ఉన్న రూట్‌లు, తక్కువ లోడ్లు ఉన్న విమానాలు, కొత్త రూట్‌లపై విమాన సంస్థలు డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉంది.
2020లో కరోనా కారణంగా భారతదేశంలో లాక్‌డౌన్(Lock Down) విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో విమాన సేవలన్నీ నిలిచిపోయాయి. అయితే విమాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన తర్వాత మే 2020లో కెపాసిటీ, ఛార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది. విమానయాన సంస్థలు నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ గత ఏడాది అక్టోబర్‌లో 100 శాతం కెపాసిటీతో విమానాలు నడపొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ధరలపై మాత్రం పరిమితులను కొనసాగించింది. ఇప్పుడు ఆ పరిమితులను కూడా ఎత్తేసి ధరలు తగ్గించడంలో పూర్తి స్వేచ్ఛను విమానయాన సంస్థలకు అందించింది. ఆగస్టు 31 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది కాబట్టి ఆ సమయం నుంచి ఎయిర్‌లైన్ సంస్థలు విమాన టికెట్ల ధరలను తగ్గించగలవు.
ప్రస్తుతం విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడంతో ఆగస్టు 31, 2022 నుంచి ప్రైస్/ఫేర్ బ్రాండ్స్‌ను తొలగించాలని నిర్ణయించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర కుమార్ బుధవారం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత విధానం ప్రకారం, రోలింగ్ ప్రాతిపదికన 0-15 రోజుల్లో విక్రయించే టిక్కెట్‌లకు ఛార్జీలపై పరిమితి వర్తిస్తుంది. 15 రోజులకు మించిన ప్రయాణాలకు మాత్రం విమానయాన సంస్థలు సొంతంగా ఛార్జీలను నిర్ణయించుకోవచ్చు.
ఫేర్ బ్యాండ్స్‌ను తొలగించడంతో డిమాండ్-సప్లై డైనమిక్స్ ఆధారంగా ధరలను నిర్ణయించే స్వేచ్ఛను విమానయాన సంస్థలు పొందుతాయి. కెపాసిటీ, ఇంధన ధర కూడా టిక్కెట్ ధరను నిర్ణయిస్తాయి. దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై ఫేర్‌బ్యాండ్‌లను తొలగించాలని ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్న ఇండిగో ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.
ఇంధన ధరలు అధికంగా ఉండటం వల్ల జులైలో విమాన ఛార్జీలు జనవరిలో కంటే 20-30 శాతం ప్రియంగా మారాయి. వివిధ సేల్ ఆఫర్‌ల కారణంగా ఆగస్టులో ఛార్జీలు తగ్గాయి. ప్రభుత్వ నిర్ణయం విమాన ప్రయాణానికి ఊపునిస్తుందని ట్రావెల్ కంపెనీలు భావిస్తున్నాయి. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లు విమానయాన సంస్థలకు టిక్కెట్ల ధర నిర్ణయించే స్వేచ్చ ఉంటుంది. ఈ స్వేచ్ఛతో విమానయాన సంస్థలు విమాన లోడ్లు తక్కువగా ఉన్న రూట్లలో ఛార్జీలను తగ్గించి.. మెట్రోల వంటి మార్గాలలో పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airlines, Flight Offers, Flight tickets, IndiGo