Gold Price | రూ.40 వేల దిశగా బంగారం ధర...కేంద్రం విసిరిన అస్త్రం పసిడిమోజు తగ్గిస్తుందా..?

గత సంవత్సరం ఆషాఢంలో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.31800గా ఉంది. అయితే ఈ ఏడాది ఆషాఢం ప్రారంభంలోనే బంగారం ధర రూ. 36000లకు చేరింది. ఈ లెక్కన శ్రావణ మాసంలో బంగారం ధర రూ.39 వేలు దాటిన ఆశ్చర్యపోవక్కర్లేదని నగల వ్యాపారులు వాపోతున్నారు.

news18-telugu
Updated: July 8, 2019, 6:38 PM IST
Gold Price | రూ.40 వేల దిశగా బంగారం ధర...కేంద్రం విసిరిన అస్త్రం పసిడిమోజు తగ్గిస్తుందా..?
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తాజాగా కేంద్ర బడ్జెట్ లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకం 2.5 శాతం పెంపు పసిడి ప్రేమికులకు శరాఘాతంగా మారింది. మన దేశంలో ప్రతీ శుభకార్యం, పర్వదినాలకు బంగారంతో విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే బంగారం కొనేందుకు మన దేశంలో ధన త్రయోదశి, అక్షయ తృతీయ పేరుతో ఏకంగా రెండు పర్వదినాలే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా చుక్కలను తాకడంతో అన్ని వర్గాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. దీంతో పెరిగిన బంగారం ధరలతో ఈ వర్గం ప్రజలు మరింత ఎక్కువగా కలత చెందుతున్నారు. సాధారణంగా ఆషాఢ మాసంలో బంగారం ధరలు తగ్గుతాయి. గత సంవత్సరం ఆషాఢంలో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.31800గా ఉంది. అయితే ఈ ఏడాది ఆషాఢం ప్రారంభంలోనే బంగారం ధర రూ. 36000లకు చేరింది. ఈ లెక్కన శ్రావణ మాసంలో బంగారం ధర రూ.39 వేలు దాటిన ఆశ్చర్యపోవక్కర్లేదని నగల వ్యాపారులు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే మన దేశంలో అమ్ముడయ్యే బంగారంలో అత్యధిక శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. దీనిపై గతంలో 10 శాతం వరకూ కస్టమ్స్ పన్ను విధిస్తున్నారు. అయితే కేంద్రబడ్జెట్ 2019లో మాత్రం కస్టమ్స్ పన్నును 12.5 శాతం వరకూ పెంచడంతో అటు వ్యాపారులతో పాటు కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం పెంచిన 2.5 శాతం అదనపు పన్ను ఫలితంగా 10 గ్రాములు బంగారంపై రూ.600 నుంచి రూ.900 వరకూ భారం పడింది. అటు బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు సైతం తమ పెట్టుబడులను రియల్ ఎస్టేట్, ఈక్విటీ మార్కెట్ల వైపు తరలించే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా బహిరంగ మార్కెట్లో బంగారం ధరలను ముంబాయి మెటల్ ట్రేడింగ్ సెంటర్(ఎంఎంటీసీ) నిర్ణయిస్తుంది. అయితే ఎంఎంటీసీ నిర్ణయించిన ధరల ఆధారంగా చూసిన బంగారం ధర సమీప భవిష్యత్తులో రూ.40 వేలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు బంగారం దిగుమతులపై సుంకం పెంపుపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్  స్పందించారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా అత్యవసరం కాని వస్తువుల దిగుమతిని తగ్గించేందుకే సుంకం పెంచామని పేర్కొన్నారు. బంగారం దిగుమతులను నిరుత్సాహపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. తద్వారా విదేశీ కరెన్సీ నిల్వల ఇతర అవసరమైన వస్తువుల దిగుమతి కోసం కేటాయించవచ్చని ఆయన పేర్కొన్నారు.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు