Gold rates : బంగారం రేటు తులానికి రూ.47 వేలకు చేరుకుంది. ఆర్థిక మాంద్య ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 1,750 డాలర్ల స్థాయికి చేరుకుంది. బంగారానికి ఇన్వెస్టర్ల పెట్టుబడులు పోటెత్తాయి. అటు.. డాలర్‌తో రూపాయి మారకం రేటు ఆల్ టైం కనిష్ఠ స్థాయికి చేరి బలహీనపడింది. దాంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి. లాక్డౌన్ ప్రభావంతో జువెల్లరీ షాపులు, బులియన్ స్పాట్ మార్కెట్లు మూతపడ్డా కమోడిటీ ఎక్స్ఛేంజ్లో మాత్రం గోల్డ్ ట్రేడింగ్ కొనసాగుతోంది. అయితే, కరోనా దెబ్బకు దేశంలో బంగారం కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. ప్రస్తుత ఏడాది మన దేశంలో పసిడి వినియోగం గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గనుందని ఓ అంచనా.
దేశంలో గత సంవత్సరం 690.4 టన్నుల బంగారాన్ని వినియోగించగా, ఈ సారి మాత్రం వినియోగం బాగా తగ్గింది. 1991 తర్వాత కనిష్ఠ స్థాయి 350-400 టన్నులకు పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేశాక కూడా ఆభరణాలకు పెద్దగా డిమాండ్ కన్పించకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. వ్యాపారులకు ఆదాయం నిలిచిపోయింది. ఉద్యోగాలు, జీతాల కోతలతో వేతన జీవులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. ఈ గడ్డుకాలంలో ప్రజలు విలాస కొనుగోళ్లకు దూరంగా ఉండనున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published:April 17, 2020, 06:36 IST