Gold Rate Today: బంగారం ధరలు కరోనా దెబ్బతో భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికే బంగారం ధర తులం(10గ్రా) ధర రూ.45 వేలు దాటింది. అయితే అటు అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములపై రూ.1500 చొప్పున పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారం భారీ పతనానికి గురైంది. పసిడి ధర 71 డాలర్ల నష్టపోయి 1,520 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఒక దశలో 1,504 డాలర్ల స్థాయికీ పడిపోయింది. ఈ సంవత్సరం పసిడి ధరలు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బంగారం ధరలు చైనా అమెరికా, వాణిజ్య యుద్ధం, ఇరాన్ తో కయ్యం అనంతరం తాజాగా కరోనా భయాల నేపథ్యంలో 1,700 డాలర్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది.
అయితే బంగారం ధరలు నిజానికి మరింత పెరిగే చాన్స్ ఉందని అంతా అంచనా వేశారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లలో పతనం కారణంగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు తరలించారు. అయితే బంగారం ఫ్యూచర్ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటోందని నిపుణుల అంచనా. మరోవైపు గ్లోబల్ ఈక్విటీలలో భారీ పతనం అనంతరం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త ఉద్దీపన చర్యలను ఆమోదించింది, అలాగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మరింత అమ్మకాన్ని నిరోధించడానికి 1.5 ట్రిలియన్ డాలర్ల స్వల్పకాలిక రుణాలను ఇచ్చింది. దీంతో మరింత సెల్లాఫ్ ఏర్పడకుండా మార్కెట్లలో అమ్మకాలను నిరోధించింది.
దేశీయంగానూ పసిడి ధర దిగివస్తోంది. దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర రూ.1,885 తగ్గి, రూ.40,321 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం పలు దేశీయ స్పాట్ మార్కెట్లలో పసిడి ధర రూ.1,500 వరకూ పడింది. నిజానికి అంతర్జాతీయంగా ధరల భారీ పతనం నేపథ్యంలో దేశీయంగానూ ఇదే ధోరణి కనబడాలి. అయితే డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ బలహీనత వల్ల ధర మరింతగా పడడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold bars, Gold ornmanets, Gold price down, Gold prices, Gold rate hyderabad, Gold rates