బంగారం ధర పరుగులు తీస్తూనే ఉంది. రూ.50,000 మార్క్ ఎప్పుడో దాటేసింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లిళ్లు, పండుగల సీజన్ మొదలుకానుంది. దీపావళి వరకు ఆ సందడి ఉంటుంది. బంగారం కొనుగోళ్లు కూడా ఎక్కువే. దీంతో ధర భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 చేరొచ్చని అంచనా. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉంటే బంగారం ధర రూ.55,000 మార్క్‌ను చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏడు నెలలుగా గోల్డ్ ర్యాలీ కొనసాగుతోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో బంగారం ధరలు 27 శాతం పెరిగాయి.
ప్రస్తుత ధరలు చూస్తే తులం బంగారం కన్నా కేజీ వెండి తక్కువ రేటుకు కొనుక్కోవచ్చు. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,000 మార్క్‌కు చేరువైంది. 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.10 పెరగడంతో రూ.50,960 ధరకు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగడంతో రూ.46,750 ధరకు చేరుకుంది. బంగారం ధర పెరిగితే వెండి రేటు భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.1,450 తగ్గడంతో రూ.48,600 ధరకు చేరుకుంది. మరోవైపు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పడిపోయాయి. గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.45 శాతం అంటే రూ.217 తగ్గడంతో రూ.48,050 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోపై 1.12 శాతం అంటే రూ.545 తగ్గి రూ.48,225 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,755 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 17.70 డాలర్లు.
మార్కెట్లు పడ్డప్పుడల్లా ఇన్వెస్టర్లు బంగారంపైకి తమ పెట్టుబడుల్ని మళ్లించడం మామూలే. గోల్డ్, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే రిస్క్ తక్కువ అన్న భావన ఎప్పట్నుంచో ఉన్నదే. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు రూ.50,000 మార్క్‌ను దాటాయి.కరోనా వైరస్ సంక్షోభం ఉన్నన్ని రోజులు బంగారానికి డిమాండ్ తగ్గే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మార్కెట్లు కోలుకుంటే ఇన్వెస్టర్లు బంగారం నుంచి ఈక్విటీస్‌లోకి తమ పెట్టుబడుల్ని తరలించే అవకాశం ఉంది. అప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. అందుకే బంగారం ధర తగ్గిన తర్వాత కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ఆయిల్ ధరలు పడిపోయాయి. అమెరికాలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో కాలిఫోర్నియా లాక్డౌన్ చర్యల్ని చేపట్టింది. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధరలు 0.3% తగ్గి బ్యారెల్ ధర 39.72 డాలర్లకు చేరుకుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.