ఇప్పుడు బంగారం కొనొచ్చా? చాలామందిలో ఇదే సందేహం. గతేడాది ఇన్వెస్టర్లకు సిరులు కురిపించిన బంగారం... కొంతకాలంగా భారీ నష్టాలు అందిస్తోంది. రికార్డు ధర నుంచి బంగారం రేటు రూ.9,000 పైనే తగ్గింది. బంగారం ధర ఊహించని స్థాయిలో పతనం అవుతోంది. 2020 ఆగస్టులో రికార్డ్ ధర నుంచి గోల్డ్ అనూహ్యంగా పడిపోయింది. ఆగస్టులో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.60,000 వరకు చేరుకుంది. ఆగస్ట్ 7న హైదరాబాద్లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130. ఇప్పుడు హైదరాబాద్లో 24 క్యారట్ గోల్డ్ బంగారం ధర రూ.49,800. అంటే ఆగస్ట్ 7 నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛమైన బంగారం ధర రూ.9,330 తగ్గింది.
ఇక ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.55,000 దగ్గరకు చేరుకుంది. ఆగస్ట్ 7న హైదరాబాద్లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారట్ బంగారం ధర రూ.45,650. అంటే ఆగస్ట్ 7 నుంచి ఇప్పటి వరకు 22 క్యారట్ బంగారం ధర రూ.8,550 తగ్గింది. బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి. కానీ గత వారం రోజులుగా వెండి ధరలు పెరిగాయి. అయినా ఆగస్ట్ 7 నాటి రికార్డ్ అలాగే ఉంది. ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.76,510. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.74,500. అంటే కిలో వెండిపై రూ.2,010 తగ్గింది.
గత ఐదున్నర నెలల్లో బంగారం, వెండి ధరలు పతనం అయిన తీరు ఇది. ఆగస్ట్ మొదటివారంలో బంగారం కొన్నవారు భారీగా నష్టపోయినట్టే. స్వచ్ఛమైన బంగారంపై రూ.9,330, ఆభరణాలు తయారు చేసే బంగారంపై రూ.8,550 నష్టపోయారు. ఊహించని స్థాయిలో పెరిగిన బంగారం ధరలు అంతే వేగంగా పడిపోతాయని అంచనా వేయలేకపోయారు. భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్న అనుమానాలు సామాన్యుల్లో ఉన్నాయి. అయితే దీర్ఘకాలంలో బంగారం ధర పెరగడం తప్ప తగ్గడం ఉండదని చరిత్ర చెబుతోంది. అంటే ఎక్కువ కాలం హోల్డ్ చేయాలనుకునేవారికి గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే. అయితే ఒక్కసారిగా బంగారం కొనకుండా తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మంచి స్ట్రాటజీ అని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు.