GOLD HALLMARKING SECOND PHASE WILL COME INTO EFFECT FROM 2022 JUNE 1 SS
Gold Hallmark: జూన్ 1 నుంచి అమలులోకి గోల్డ్ హాల్మార్కింగ్ రెండో దశ
Gold Hallmark: జూన్ 1 నుంచి అమలులోకి గోల్డ్ హాల్మార్కింగ్ రెండో దశ
(ప్రతీకాత్మక చిత్రం)
Gold Hallmark | జూన్ 1 నుంచి రెండో దశ గోల్డ్ హాల్మార్కింగ్ అమలులోకి రానుంది. మరిన్ని జిల్లాల్లో గోల్డ్ హాల్మార్కింగ్ కేంద్రాలు (Gold Hallmarking Centers) అందుబాటులోకి వస్తాయి. వినియోగదారులు తమ ఆభరణాల్లో బంగారం ఎంత ఉందో ఈ కేంద్రాల్లో తెలుసుకోవచ్చు.
బంగారు నగలు కొనేవారికి, అమ్మేవారికి అలర్ట్. గోల్డ్ హాల్మార్కింగ్ రెండో దశ జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం బంగారు నగలపై గోల్డ్ హాల్మార్కింగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో గోల్డ్ హాల్మార్కింగ్ స్వచ్ఛందంగా ఉండేది. కానీ 2021 జూన్ 16న గోల్డ్ హాల్మార్కింగ్ మొదటి దశ అమలులోకి వచ్చింది. దేశంలోని 256 జిల్లాల్లో మొదటి దశ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రెండో దశ అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. 2022 జూన్ 1 నుంచి గోల్డ్ హాల్మార్కింగ్ రెండో దశ అమలులోకి రానుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
నిబంధనల ప్రకారం బంగారు నగలపై మరో మూడు రకాల క్యారట్లు కవర్ కానున్నాయి. 20, 23, 24 క్యారట్స్ కవర్ అవుతాయి. రెండో దశలో మరో 32 జిల్లాల్లో గోల్డ్ హాల్మార్కింగ్ అమలులోకి వస్తుంది. ఇక ఇప్పటికే 256 జిల్లాల్లో ఏర్పాటు చేసిన గోల్డ్ హాల్ మార్కింగ్ సెంటర్లలో రోజూ 3 లక్షలకు పైగా బంగారు ఆభరణాలకు హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) ముద్రిస్తున్నారు.
ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వినియోగదారులకు మరో అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. బీఐఎస్ గుర్తించిన అస్సేయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్లకు సామాన్యులు కూడా వెళ్లి తమ బంగారు ఆభరణాలను పరీక్షించుకోవచ్చు. వినియోగదారులు తీసుకొచ్చిన బంగారు ఆభరణాలను ఈ కేంద్రాల్లో పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తారు. నాలుగు ఆభరణాలను టెస్ట్ చేయడానికి రూ.200 చెల్లించాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రతీ ఆభరణానికి రూ.45 చొప్పున చెల్లించాలి.
గతేడాది జూన్లో తెలంగాణలో 7, ఆంధ్రప్రదేశ్లో 12 అస్సేయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ కేంద్రాలున్నాయి. దేశంలో ఉన్న గోల్డ్ హాల్మార్కింగ్ సెంటర్ల అడ్రస్లు బీఐఎస్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
బంగారం, వెండి ఆభరణాలు, వస్తువుల స్వచ్ఛతను కొలిచేందుకు హాల్మార్కింగ్ తప్పనిసరి. హాల్మార్క్ అంటే బంగారం, వెండి స్వచ్ఛతను తెలిపే స్టాండర్డ్. నగల్లో ఎంత బంగారం ఉందో తెలుసుకోవడానికి హాల్మార్కింగ్ ఉపయోగపడుతుంది. బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారు. 24 క్యారట్ అంటే స్వచ్ఛమైన బంగారం. 916 హాల్మార్క్ ఉంటే అది 22 క్యారట్ బంగారం అని అర్థం. 22 క్యారట్ కాకుండా 18 క్యారట్ నగలు కూడా ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.