Gold hallmarking: మీ ఇంట్లో పాత బంగారు నగలున్నాయా...అయితే జాగ్రత్త...ఇది చదివితీరాల్సిందే...

ప్రతీకాత్మకచిత్రం

హాల్‌మార్క్ విధానం తప్పనిసరి కావడంతో.. హాల్​మార్కింగ్​ లేని పాత ఆభరణాల సంగతేంటని అంతా ఆలోచిస్తున్నారు. అయితే, హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను కలిగి ఉన్న వ్యక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం తెలిపింది.

  • Share this:
కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా బంగారు ఆభరణాలకు హాల్​మార్క్​ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో బంగారం హాల్​మార్కింగ్​ జూన్​ 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, ఇకపై హాల్​మార్క్​ లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించరాదు. ఒకవేళ, విక్రయిస్తే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకుంటారు. అందువల్ల, గోల్డ్​ మర్చంట్లు బీఐఎస్​ హాల్​ మార్కింగ్​ సర్టిఫైడ్​ బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. కాగా, ఈ హాల్​మార్కింగ్​ ప్రక్రియను దశల వారీగా అమలు చేయనున్నారు. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మొదటి దశలో 256 జిల్లాల్లో బంగారు హాల్‌మార్కింగ్ అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

ఈ అంశంపై పియూష్ గోయల్ మాట్లాడుతూ.. "వినియోగదారుల మెరుగైన రక్షణ, సంతృప్తి కోసం మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జూన్ 16 నుంచి 256 జిల్లాల్లో హాల్​మార్కింగ్ తప్పనిసరి చేశాం. అయితే ఈ సరికొత్త విధానానికి అలవాటు పడేందుకు జ్యూవెలరీ యాజమాన్యాలకు కొంత సమయం పడుతుంది. అందువల్లే వారికి 2021 ఆగస్టు వరకు ఎటువంటి జరిమానా విధించకూడదని నిర్ణయించాం. ఈ విధానం ద్వారా ప్రపంచ బంగారు మార్కెట్​​ కేంద్రంగా భారత్​ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు.

గోల్డ్ హాల్​మార్కింగ్ అంటే ఏమిటి?
గోల్డ్​ హాల్‌మార్కింగ్ అనేది బంగారం వంటి లోహాల స్వచ్ఛతను ధ్రువీకరిస్తుంది. బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్​ (బీఐఎస్​) దీన్ని పర్యవేక్షిస్తుంది. ఆభరణాలపై హాల్​మార్క్​ ప్రింట్​ అయి ఉంటే.. దాని స్వచ్ఛత ధ్రువీకరించినట్లు అర్ధం చేసుకోవాలి. హాల్​మార్క్​లోని బీఐఎస్​ ప్రింట్​, బంగారు క్యారట్​ డేటా, సెంటర్​ లోగో, హోల్​ మార్కర్​ డేటా వంటి మొత్తం 4 గుర్తులు ఉంటాయి. తద్వారా కస్టమర్లు మోసపోకుండా స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయవచ్చు. 2000 సంవత్సరం నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) దేశంలో హాల్‌మార్కింగ్ స్కీమ్​ను నిర్వహిస్తోంది. దేశంలో 40 శాతానికి పైగా ఆభరాణాలకు హాల్​మార్కింగ్ ఉందని అంచనా.

పాత ఆభరణాల సంగతేంటి?
హాల్‌మార్క్ విధానం తప్పనిసరి కావడంతో.. హాల్​మార్కింగ్​ లేని పాత ఆభరణాల సంగతేంటని అంతా ఆలోచిస్తున్నారు. అయితే, హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను కలిగి ఉన్న వ్యక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం తెలిపింది. పాత ఆభరణాలపై చర్చించేందుకు వాటాదారులు, రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే, బంగారు గడియారాలు, ఫౌంటెన్ పెన్నులు, కుందన్, పోల్కి, జాడౌతో సహా ప్రత్యేక ఆభరణాలకు మాత్రం హాల్‌మార్కింగ్ నుండి మినహాయింపు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అంతేకాక, హాల్‌మార్క్ లేని పాత బంగారు ఆభరణాలను తిరిగి కొనుగోలు చేయడాన్ని కొనసాగించవచ్చని పేర్కొంది. పాత ఆభరణాలను కరిగించి చేసే కొత్త ఆభరణాలకు హాల్‌మార్క్ చేయవచ్చని స్పష్టం చేసింది.

వీటికి మినహాయింపు
రూ .40 లక్షల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి నిబంధన నుంచి మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. భారత ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం, విదేశాలకు ఎగుమతి చేసే ఆభరణాలకు హాల్‌మార్కింగ్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. అయితే, భారత్​లో మాత్రం 2021 జూన్ 15 నుంచి 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉంటుంది.
Published by:Krishna Adithya
First published: