GOGORO TIE UP WITH HERO MOTOCORP FOR TO TARGET INDIAN E SCOOTER MARKET NS GH
Hero-Gogoro e-scooter: చేతులు కలిపిన హీరో, గొగొరో సంస్థలు.. ఇక భారత్ లో ఈ-స్కూటర్ మార్కెట్ పరుగులే..
ప్రతీకాత్మక చిత్రం
హీరో సంస్థ తైవాన్‌కు చెందిన గొగొరో అనే సంస్థతో చేతులు కలిపింది. త్వరలో ఈ రెండు సంస్థలు కలసి భారత మార్కెట్లోకి ఈ- స్కూటర్‌ను తీసుకొస్తామని ప్రకటించాయి. దీంతో ఈ రెండు సంస్థల మధ్య డీల్ కుదిరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత దేశ ఆటోమొబైల్ భవిష్యత్ ఇక ఎలక్ట్రానిక్ వెహికిల్సే అని అందరూ ఊహిస్తున్న విషయమే. గత కొన్ని రోజులుగా దేశంలో ఈ-వెహికిల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. ఈ రంగంలో తమదైన ముద్ర వేయడానికి హీరో మోటో కార్ప్ కూడా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తైవాన్‌కు చెందిన గొగొరో అనే సంస్థతో చేతులు కలిపింది. త్వరలో ఈ రెండు సంస్థలు కలసి భారత మార్కెట్లోకి ఈ- స్కూటర్‌ను తీసుకొస్తామని ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ రెండు సంస్థల మధ్య డీల్ కుదిరింది. హీరో ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ సైకిల్ ఉత్పత్తి సంస్థ అనే విషయం మనకు తెలిసిందే. మరోవైపు గొగొరో కూడా పెద్ద సంస్థే. తైవాన్ గొగొరోకు బ్యాటరీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. ఈ- వెహికిల్స్ బ్యాటరీలను మార్పిడి చేస్తూ ఉంటుంది. అంటే వాహనాల్లో బ్యాటరీ సామర్థ్యం అయిపోయినప్పుడు గొగొరో కౌంటర్/సెంటర్‌కు వెళ్లి దాన్ని మార్చుకోవచ్చు. అంటే అయిపోయిన బ్యాటరీని అక్కడ పెట్టేసి, కొత్తది తీసుకోవచ్చు. దీని కోసం డబ్బు చెల్లించాలి. ఇప్పుడు అదే నెట్‌వర్క్‌ను మన దేశంలోనూ తీసుకురావాలని గొగొరో వస్తోంది. దీనికి పార్టనర్‌గా హీరోను ఎంచుకుంది. అంటే హీరో - గొగొరో పేరుతో బ్యాటరీ స్వాపింగ్ కౌంటర్లు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.
బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలతోపాటు ఈ- స్కూటర్ల తయారీలోనూ హీరో మోటోకార్ప్‌కు గొగొరో సాంకేతికత, బ్యాటరీలను అందిచనుంది. ఈ రెండు సంస్థలు కలసి మన దేశంలో ఈ-వెహికిల్స్‌ను తీసుకొస్తాయన్నమాట. ఈ మేరకు గొగొరో వ్యవస్థాపకుడు, సీఈవో హోరేష్ లూక్, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజల్ సంయుక్తంగా ప్రకటించారు. తొలుత బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తారట.
మరోవైపు గొగొరో ఇటీవల యూరప్‌లో స్కూటర్ షేరింగ్ సర్వీసును ప్రారంభించింది. అలాగే జపాన్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీసును కూడా మొదలుపెట్టడం గమనార్హం. భారత్‌లో ప్రజలు ఈ-స్కూటర్లకు అలవాటుపడటానికి ఇంకా చాలా సమయం పడుతుందని గొగొరో సీఈవో హోరేష్ ల్యూక్ అన్నారు. అయితే హీరోతో కలసి ఈ రంగంలోకి రావడం వల్ల ధర, పంపిణీ విషయంలో కొంతమేర ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మా కలయిక ఈ-స్కూటర్ మార్కెట్లో పెద్ద మార్పే తీసుకొస్తుందని ల్యూక్ చెప్పారు. అయితే స్కూటర్ ఫీచర్ల, ధర, ఎప్పుడు వచ్చేది లాంటి వివరాలు రెండు సంస్థలూ చెప్పలేదు. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.