ఒకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ కేవలం ఉత్తరాల బట్వాడా మాత్రమే చేసేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు సరికొత్త సేవలు అందిస్తోంది. బ్యాంకులతో పోటీగా సేవింగ్ స్కీమ్స్ (Saving Schemes) అమలు చేస్తోంది. ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి మంచి ఆదాయాన్ని అందిస్తోంది. పోస్టాఫీసుల్లో పెట్టుబడులపై (Post Office Schemes) భద్రతతో పాటు మంచి రాబడి కూడా ఉంటుంది. అందుకే వీటికి ఆదరణ పెరుగుతోంది. పోస్టాఫీస్ అందిస్తున్న అన్ని స్కీమ్‌లలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అత్యంత ప్రాచుర్యం పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అనేది ప్రభుత్వ హామీ గల స్కీమ్. ఈ స్కీమ్‌లో పెట్టుబడి ద్వారా మీ రాబడికి హామీ ఉంటుంది. ఈ సురక్షితమైన పెట్టుబడి పథకంలో ప్రతినెలా చిన్న మొత్తంలో జమ చేసుకోవచ్చు. ఈ పథకంలో కేవలం రూ .100 నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు కోరుకున్నంత డబ్బును ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఐదేళ్లపాటు తెరవవచ్చు. డిపాజిట్ చేసిన డబ్బుపై ప్రతి త్రైమాసికానికి వడ్డీ జమ అవుతుంది.
Aadhaar Card Update: తెలుగులో మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయండి ఇలా
ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం 5.8% వడ్డీని అందిస్తుంది. ఈ కొత్త వడ్డీ రేటు 2020 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సవరిస్తుంది. కేంద్రం నిర్ణయించిన వడ్డీ రేట్ల ఆధారంగా మీరు ఇన్వెస్ట్ చేసిన డిపాజిట్‌పై వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో మీరు ప్రతి నెలా రూ .10 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత మీకు మొత్తం రూ. 16 లక్షలు చేతికి అందుతాయి.
Cheque Book: అలర్ట్... అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకు చెక్ బుక్స్ పనిచేయవు
ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే క్రమం తప్పకుండా నెలవారీగా డిపాజిట్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ సమయానికి డిపాజిట్ చేయడంలో విఫలమైతే, ప్రతి నెలా ఒక శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా కారణంతో వరుసగా నాలుగు నెలల పాటు డబ్బులు జమ చేయకపోతే అకౌంట్‌ను మూసివేస్తారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేయాలనుకునేవారికి ఇలాంటి పొదుపు పథకాలు ఉపయోగపడతాయి. ఇలాంటి సేవింగ్స్ స్కీమ్స్‌లో నెలనెలా కొంత మొత్తం పొదుపు చేయడం ద్వారా కొన్నేళ్లలో మీ డబ్బులకు వడ్డీ కూడా కలిపి భారీగా రిటర్న్స్ వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earn money, India post, Personal Finance, Post office, Post office scheme, Save Money