పవిత్ర గంగానది పుష్కరాలు ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు జరగనున్నాయి. కోట్లాది మంది భక్తులు గంగా పుష్కరాల్లో (Ganga Pushkaralu) పాల్గొనడానికి రాబోతున్నారు. మరి మీరు కూడా గంగానది పిష్కరాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? ఇటీవల వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన కాశీ టెంట్ సిటీలో (Kashi Tent City) వసతి బుక్ చేసుకోవచ్చు. వారణాసికి వచ్చే భక్తుల కోసం ఈ టెంట్ సిటీని నిర్మించిన సంగతి తెలిసిందే. భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారణాసిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే ఈ టెంట్ సిటీ లక్ష్యం. మరి మీరు కూడా ఈ టెంట్ సిటీలో వసతి బుక్ చేయాలనుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.
వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ ఈ టెంట్ సిటీని నిర్మించింది. భక్తులు వారణాసిలోని వేర్వేరు ఘాట్ల నుంచి టెంట్ సిటీకి పడవల ద్వారా చేరుకోవచ్చు. ఈ టెంట్ సిటీ అక్టోబర్ నుంచి జూన్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో టెంట్ సిటీని తొలగిస్తారు. కాశీ టెంట్ సిటీలో మూడు రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి. విల్లా, సూపర్ డీలక్స్, డీలక్స్ పేరుతో కాటేజీలు అందుబాటులో ఉంటాయి.
Ganga Pushkarala Yatra: గంగా పుష్కరాలకు వెళ్తారా? తెలుగు రాష్ట్రాల నుంచి నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ
విల్లా విస్తీర్ణం 900 చదరపు అడుగులు, కాశీ సూట్ విస్తీర్ణం 576 చదరపు అడుగులు, సూపర్ డీలక్స్ కాటేజీ విస్తీర్ణం 480 నుంచి 580 చదరపు అడుగులు, డీలక్స్ కాటేజీ విస్తీర్ణం 250 నుంచి 400 చదరపు అడుగులు ఉంటుంది. ఆర్ట్ గ్యాలరీ, లైబ్రరీ, గేమింగ్ జోన్, రెస్టారెంట్లు, డైనింగ్ ఏరియా, కాన్ఫరెన్స్ సదుపాయాలు, స్పా, యోగా స్టూడియో లాంటి సౌకర్యాలు ఉన్నాయి. గంగా తీరంలో వాటర్ స్పోర్ట్స్, ఒంటె సవారీ, హార్స్ రైడ్ లాంటివి ఎంజాయ్ చేయొచ్చు.
కాశీ టెంట్ సిటీలో అకామడేషన్ బుక్ చేయాలంటే https://www.tentcityvaranasi.com వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇందులో వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఛార్జీల విషయానికి వస్తే గంగా దర్శన్ విల్లాలో ప్యాకేజీ ధర రూ.40,000 కాగా, బెడ్, బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే ఎంచుకుంటే ధర రూ.30,000. కాశీ సూట్స్‌లో ప్యాకేజీ ధర రూ.24,000 కాగా, బెడ్, బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే ఎంచుకుంటే ధర రూ.17,000. ఇక ప్రీమియం టెంట్స్‌లో ప్యాకేజీ ధర రూ.20,000 కాగా, బెడ్, బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే ఎంచుకుంటే ధర రూ.13,000. డీలక్స్ టెంట్‌లో ప్యాకేజీ ధర రూ.15,000 కాగా, బెడ్, బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే ఎంచుకుంటే ధర రూ.8,000.
ఈ ధరలన్నీ ఒకరికి మాత్రమే. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్యాకేజీ ధర. ప్యాకేజీ ఎంచుకున్నవారికి లంచ్, హై టీ, వారణాసి ఘాట్ దర్శన్, కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనం, గంగా హారతి, రిసార్ట్‌లో లైవ్ మ్యూజిక్‌తో డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు, రెండో రోజు ఉదయం గంగానది తీరంలో ఔట్‌డోర్ యోగా, బ్రేక్‌ఫాస్ట్ లాంటివి కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.