మళ్లీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు... వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రమే

ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో... పెట్రోల్ ధరలు పెరుగుతుండటం కేంద్ర ప్రభుత్వానికి షాకేనా? ఎందుకీ పరిస్థితి వస్తోంది? అంతర్జాతీయ అంశాల ప్రభావం ఎంత?

Krishna Kumar N | news18-telugu
Updated: January 20, 2019, 2:37 PM IST
మళ్లీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు... వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రమే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.70.95లు ఉంది. డీజిల్‌ రూ.65.45లుగా నమోదైంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెరిగాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.58లు ఉండగా, డీజిల్‌ రూ.68.53లు ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ.75.27, కోల్‌కతాలో రూ.73.05, చెన్నైలో రూ.73.65, గుర్గావ్‌లో రూ.71.56, నోయిడాలో రూ.70.66, బెంగళూరులో 73.29, పాట్నాలో రూ.75.24గా నమోదైంది. దేశమంతటా ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ పెంపు ఎప్పుడూ ఉండేదేగా అని లైట్ తీసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇందుకు చాలా కారణాలున్నాయి.

మనకు తెలియకుండానే నెల నెలా పెట్రోల్, డీజిల్ కోసం మనం వందల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నాం. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పెరిగిపోతోంది. అందువల్ల మనం వాడే వాహనాల వేగం తగ్గిపోతోంది. ఎక్కువ సేపు ఫస్ట్, సెకండ్ గేర్లలో వెళ్తున్న మనం... బోల్డంత పెట్రోల్, డీజిల్ వాడాల్సి వస్తోంది. అదే మన జేబులకు చిల్లు అనుకుంటే... పెరిగే ధరలు మరింత లాగేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్లే తామూ పెట్రోల్ ధరలు పెంచుతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. పెంపు భారాన్ని మనపైనే వేసేస్తూ కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి.

2014లో పెట్రోల్ ధరలు లీటర్‌కి దాదాపు రూ.80కి వెళ్లడంతో... అప్పట్లో ప్రజలు యూపీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ కోపంతో బీజేపీకి ఓట్లు వేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో... లీటర్ పెట్రోల్ దాదాపు రూ.61కే వచ్చింది. అ తర్వాత ఈ నాలుగేళ్లలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఓ దశలో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.92కి చేరి, సరికొత్త రికార్డు సృష్టించింది.సాధారణంగా ఎన్నికల ఏడాదిలో పెట్రోల్ ధరలు పెరగకుండా కేంద్రం జాగ్రత్తపడుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలప్పుడు కేంద్రం అదే చేసింది. ఎన్నికలు పూర్తవగానే పెట్రోల్ ధరలు అమాంతం పెరిగాయి. ఇక ఇప్పుడు కేంద్రం పట్టించుకోకపోవడంతో పెట్రోల్ కంపెనీలు రోజురోజుకూ ధరలు పెంచేస్తున్నాయి. ఇలాగే కొనసాగితే, ఇది ప్రజల్లో కేంద్రం పట్ల వ్యతిరేక భావాన్ని పెంచే ప్రమాదం ఉంటుంది. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ఏం చేస్తారో..

Video: గాంధీనగర్‌లో తొలి ఎలక్ట్రిక్ బస్..అతి త్వరలో రోడ్లపై పరుగులు
First published: January 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>