అమెరికా (America)లోని లాస్ ఏంజెలెస్ (Los Angels)కు చెందిన లాయర్ నికోలస్ డఫౌ గూగుల్‌లో అసోసియేట్ ప్రొడక్ట్ కౌన్సెల్‌గా గత ఆర్నెళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 17న అర్ధరాత్రి 2 గంటలకు డఫౌ కుమార్తెకు తండ్రయ్యాడు. దీంతో అతడి తోటి ఉద్యోగులు ప్రశంసలతో ముంచెత్తారు. పెటర్నిటీ సెలవులను గారాల పట్టితో మరింతగా ఆస్వాదించాలని వారు డఫౌకు సూచించారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రి 2 గంటలకు గూగుల్ (Google) నుంచి మెయిల్ వచ్చింది. తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ మెయిల్ చేయడంతో షాక్‌కి గురయ్యాడు.
గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం టెక్ రంగంలో సంచలనం రేపింది. అత్యంత ప్రతిభావంతులుండే గూగుల్ కంపెనీలోనే ‘లే ఆఫ్స్’ జరుగుతున్నాయంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఏంటా అని అంతా చర్చించుకున్నారు. అయితే, ఉద్యోగం కోల్పోయిన వారి గాథలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. కంపెనీ నుంచి మెయిల్ వచ్చినప్పుడు వారు ఎలాంటి అనుభూతి చెందారో ఒక్కో ఉద్యోగి వెల్లడిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మెటర్నిటీ సెలవులో ఉన్న మహిళా ఉద్యోగి నుంచి పెటర్నిటీ సెలవుల్లో డఫౌ వరకూ అందరిదీ ఇదే వ్యథ.
* డఫౌ ఆవేదన
కుమార్తె పుట్టిందన్న ఆనందంలో డఫౌ ఎంతో సంబరపడిపోయాడు. అయితే, అతడికి ఆ ఆనందం ఎక్కువ సమయం పాటు నిలవలేదు. రెండు రోజులు గడవగానే గూగుల్ తనను ఉద్యోగంలోంచి తీసేసింది. అర్ధరాత్రి 2గంటలకు తన కుమార్తెకు పాలు పడుతున్న సమయంలో ఈ మెయిల్ వచ్చిందని డఫౌ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకేం తోచలేదని చెప్పుకుంటూ డఫౌ విచారం వ్యక్తం చేశాడు.
‘నా బిడ్డకు పాలు పడుతున్న సమయంలో నాకో నోటిఫికేషన్ వచ్చింది. గూగుల్ కార్పొరేటర్ సర్వీసెస్‌ని నిలిపివేస్తున్నట్లు అందులో ఉంది. అంటే నన్ను తీసేస్తున్నట్లు సంస్థ ఆటోమేటెడ్ మెయిల్ పంపించింది’ అంటూ నికోలస్ డఫౌ ఆ సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
తోటి ఉద్యోగులు తనకు ఎంతో సహకరించేవారని డఫౌ వెల్లడించాడు. సంస్థకు ఉద్యోగులు పెద్ద నిధి అని నాలో ధైర్యం నింపారని చెప్పాడు. ‘ఉద్యోగంలో చేరి సరిగ్గా ఆర్నెళ్లు పూర్తయిన వారం రోజులకే నాకు కుమార్తె పుట్టింది. అప్పుడు నాకు తోటి ఉద్యోగులు ఎంతో సహకరించారు. పేటర్నిటీ సెలవులు తీసుకుని కుటుంబానికి విలువైన సమయాన్ని కేటాయించాలని సూచించారు.
సంస్థ(గూగుల్)కు ఉద్యోగులే ప్రధాన నిధి అంటూ నాలో ధైర్యాన్ని నింపారు. ఆ సమయంలో వీరి మధ్యలో నేనుండటం ఎంతో అదృష్టంగా భావించా’ అని నికోలస్ వెల్లడించాడు. కానీ, ఆ పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి తీసివేయడమే బాధ కలిగించిందని పేర్కొన్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ తన తోటి ఉద్యోగులు తనలో ధైర్యం నూరిపోశారని నికోలస్ చెప్పుకొచ్చాడు. ‘అన్నిటికన్నా ముఖ్యంగా నా వెన్నంటి ఉండి నన్ను సపోర్ట్ చేస్తున్న నా భార్యకు రుణపడి ఉంటా’ అని భావోద్వేగానికి గురయ్యాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.