Hybrid Flying Car: త్వరలోనే విమానం లాగా గాల్లోకి ఎగిరే కారు.. భారత్​లో లాంచ్​..ఎప్పుడంటే..

ప్రతీకాత్మకచిత్రం

త్వరలోనే దేశంలో హైబ్రిడ్​ ఫ్లయింగ్ కార్లు రాబోతున్నాయి. ఇవి నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. అంతేకాదు క్షణాల్లో సరుకు రవాణా, వైద్య అత్యవసర సేవలు అందించనున్నాయి. భారత్​లో వీటి లాంచింగ్​ను ధ్రువీకరిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ట్వీట్ చేశారు.

  • Share this:
ఆఫీసుకు వెళ్లే మార్గంలో అంతులేని ట్రాఫిక్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?.. అయితే ఇకపై మీ తిప్పలు తప్పనున్నాయి. త్వరలోనే దేశంలో హైబ్రిడ్​ ఫ్లయింగ్ కార్లు రాబోతున్నాయి. ఇవి నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. అంతేకాదు క్షణాల్లో సరుకు రవాణా, వైద్య అత్యవసర సేవలు అందించనున్నాయి. భారత్​లో వీటి లాంచింగ్​ను ధ్రువీకరిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ట్వీట్ చేశారు. ఈ ఫ్లయింగ్​ కారును చెన్నైకి చెందిన వినతా ఏరోమొబిలిటీ అనే స్టార్టప్​ సంస్థ తయారు చేసింది. దీన్ని అక్టోబర్ 5న లండన్​లో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద హెలిటెక్ ఎగ్జిబిషన్ ఎక్సెల్​లో లాంచ్​ చేయనున్నారు. ఆసియాలోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు మన దేశంలో లాంచ్ అవుతుండటం విశేషం..

నమ్మశక్యం కాని అనుభవం

వినతా హైబ్రిడ్ ఫ్లయింగ్ కారులో కృత్రిమ మేధస్సుతో తయారు చేసిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్స్​ ఉంటుంది. దీని ద్వారా కారు సునాయాసంగా ఎగరగలదు. అంతేకాదు దానికదే డ్రైవింగ్ చేసుకుంటూ గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఈ కారులోపల విలాసవంతమైన, ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్‌ను అందిస్తోంది. దీని బోర్డులో జీపీఎస్​ ట్రాకర్, ఎంటర్​టైన్​మెంట్​ సిస్టమ్​ వంటివి చేర్చింది. ఈ ఎగిరే కారు 300- డిగ్రీల వ్యూయింగ్​ను అందించే పనోరమిక్ విండోతో వస్తుంది.

వర్టికల్​ టేకాఫ్, ల్యాండింగ్

హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు బరువు 1100 కిలోల వరకు ఉంటుంది. ఇది గరిష్టంగా 1300 కిలోల బరువు మోయగలదు. ఇందులో ఏకకాలంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే వీలుంటుంది. వర్టికల్​గా టేకాఫ్​ ల్యాండిగ్​ అవ్వడం ఈ కారు ప్రత్యేకత. ఈ కారులో హైబ్రిడ్​ ఇంజిన్​ను ఏర్పాటు చేశారు. కారు ఎగిరేందుకు బయో ఫ్యూయల్​ని ఉపయోగించుకుంటుంది. అదే విధంగా సందర్భాన్ని బట్టి ఎలక్ట్రిక్​ ఎనర్జీని కూడా వాడుకుంటుంది.

3000 అడుగుల ఎత్తులో ప్రయాణం

ఈ కారు పైకి ఎగిరేందుకు కో యాక్సియల్​ క్వాడ రోటర్​ని ఏర్పాటు చేశారు. కారు ప్యానెల్​లో డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్స్​ కూడా వాడుతున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ కారు నేల నుంచి 3,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. ఒక్కసారి ఫ్యూయల్​ నింపితే వంద కిలోమీటర్లు లేదా గంట సేపు ప్రయాణం చేయగలదు. ఈ కార్లు గంటకు 100 నుంచి -120 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

ప్రయాణికులకు భద్రత

హైబ్రిడ్ ఫ్లయింగ్ కారులో డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఉంటుంది. ఈ ఎగిరే కారులో బహుళ మోటార్లు, ప్రొపెల్లర్లు ఉంటాయి. ఇది ప్రయాణీకులకు భద్రతను అందిస్తుంది. అయితే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రొపెల్లర్లు లేదా మోటార్లు విఫలమైతే, మంచి స్థితిలో ఉన్న మిగిలిన ప్రొపెల్లర్లు, మోటార్లతో ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్ చేయగలవు. ఒకవేళ జనరేటర్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడితే, బ్యాకప్ పవర్ మోటార్‌ విద్యుత్తును అందిస్తుంది. ఈ ఎగిరే కారులో ఎయిర్ బ్యాగ్స్ ఎనేబుల్డ్ కాక్ పిట్ పారాచూట్ కూడా ఉంటుంది.

అర్బన్ ఎయిర్ మొబిలిటీ

అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM) విధానం త్వరలో అమెరికా, యూరోప్‌ వంటి అభివృధ్ధి చెందిన దేశాలో అందుబాటులోకి రానుంది. జపాన్‌లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ బోయింగ్, ఎయిర్‌బస్ ఫ్లయింగ్ టాక్సీలను నిర్వహిస్తున్నాయి. లాక్‌హీడ్ మార్టిన్, ఉబెర్ సంస్థలు కూడా ఫ్లయింగ్​ టాక్సీలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
Published by:Krishna Adithya
First published: