Interest Rates: సేవింగ్స్ అకౌంట్లపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న ఐదు ప్రైవేట్ బ్యాంకులు ఇవే.. పూర్తి వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని చిన్న, కొత్త ప్రైవేట్ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లతో పోలిస్తే.. ఇవి మెరుగైన సేవింగ్స్ రేట్లను అందిస్తున్నాయి.

  • Share this:
ఈ రోజుల్లో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లేనివారు చాలా అరుదు అని చెప్పవచ్చు. సేవింగ్స్ అకౌంట్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లిక్విడిటీ, వడ్డీ ప్రయోజనాలతో పాటు డబ్బును సులభంగా దాచుకోవచ్చు. మెరుగైన వడ్డీ రేట్లు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర స్కీమ్‌లలో చేసే పెట్టుబడులను అత్యవస్థర పరిస్థితుల్లో విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. కానీ సేవింగ్స్ అకౌంట్లో దాచే డబ్బును ఎప్పుడైనా సులభంగా తీసుకోవచ్చు. కొన్ని చిన్న, కొత్త ప్రైవేట్ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లతో పోలిస్తే.. ఇవి మెరుగైన సేవింగ్స్ రేట్లను అందిస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై అత్యుత్తమ వడ్డీ రేట్లను అందించే టాప్-5 ప్రైవేట్ బ్యాంకుల వివరాలు తెలుసుకుందాం.

* DCB బ్యాంక్
సేవింగ్స్ అకౌంట్లపై డీసీబీ బ్యాంక్ 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో డీసీబీ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. అయితే అకౌంట్లో ప్రతినెలా రూ.2,500 నుంచి రూ.5,000 వరకు నెలవారీ బ్యాలెన్స్ (Average Monthly Balance) ఉంచాలి.

* RBL బ్యాంక్
RBL బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై 6 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే అకౌంట్లో ఉంచాల్సిన సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 2,500 నుంచి రూ .5,000 వరకు ఉంటుంది.

* బంధన్ బ్యాంక్
బంధన్ బ్యాంక్ సైతం సేవింగ్స్ అకౌంట్లపై 6 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇందుకు అకౌంట్లో రూ. 5,000 నెలవారీ బ్యాలెన్స్ ఉండాలి.

* యెస్ బ్యాంక్
సేవింగ్స్ అకౌంట్లపై యెస్ బ్యాంక్ 5.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇందుకు అకౌంట్లో ఉంచాల్సిన సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 10,000 నుంచి రూ. 25,000 వరకు ఉండవచ్చు.

* ఇండస్ఇండ్ బ్యాంక్
ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లపై 5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే అకౌంట్లో ఉంచాల్సిన సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ .1500 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది.

ఈ డేటాను బ్యాంక్‌బజార్ సేకరించింది. BSEలో లిస్ట్ అయిన అన్ని ప్రైవేట్ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేటును ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. 2021 సెప్టెంబర్ 1 నాటికి అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే బ్యాంక్‌బజార్ సేకరించింది. అధికారిక సమాచారం కోసం ఖాతాదారులు బ్యాంకుల వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించింది.

చిన్న ప్రైవేట్ బ్యాంకులు కొత్త రిటైల్ కస్టమర్లను ఆకర్షించడానికి మెరుగైన సేవింగ్స్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. HDFC, ICICI వంటి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ఇవి అత్యధిక వడ్డీ రేట్లను ప్రకటించాయి. అయితే మంచి ట్రాక్ రికార్డ్, మెరుగైన సర్వీస్ రూల్స్, విస్తృతమైన బ్రాంచ్ నెట్‌వర్క్, ఏటీఎం సర్వీసులు ఉన్న బ్యాంకులను ఖాతాదారులు ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: