కరోనా(Corona) తరువాత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ (Health Insurance) అవసరాలు ప్రజలకు తెలిశాయి. దీంతో చాలామంది కొత్తగా పాలసీలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ ట్రీట్‌మెంట్‌కు చాలామంది భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం రేట్లను(Premium Rates) సైతం పెంచాయి. అయినా కూడా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా(Health Insurence) తప్పకుండా ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే వీటిపై నెలకొన్న కొన్ని అపోహల కారణంగా చాలామంది ఇప్పటికీ పాలసీలకు దూరంగా ఉంటున్నారు. అసలు హెల్త్ పాలసీలపై ఎలాంటి పుకార్లు, అపోహలు (Health insurance myths) ప్రచారంలో ఉన్నాయి, వాటిలో నిజం ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.
అపోహ 1: యువత, ఆరోగ్యవంతులకు పాలసీ అవసరం లేదు..
వాస్తవం: చిన్న వయసులోనే హెల్త్ పాలసీ తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి అన్ని వ్యాధులను అది కవర్ చేయదు. కొన్ని నిర్దిష్ట వ్యాధులకు కవరేజీ వర్తించడానికి 2-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు. అందువల్ల హెల్త్ ప్లాన్‌ను వీలైనంత త్వరగా తీసుకోవడం మంచిది. ఎంత ఆరోగ్యవంతులైనా, అనుకోని వ్యాధుల బారిన పడినప్పుడు ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిందే. ఈ ఖర్చులను హెల్త్ పాలసీ భర్తీ చేస్తుంది కాబట్టి అందరూ వీటిని కొనుగోలు చేయాలి.
అపోహ 2: హెల్త్ పాలసీ క్లెయిమ్ చేయడానికి కనీసం 24 గంటలు ఆసుపత్రిలో చేరడం తప్పనిసరి..
వాస్తవం: ప్రస్తుతం అధునాతన టెక్నాలజీతో కొన్ని వ్యాధులకు ఆపరేషన్లను 24 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. అనేక ఆరోగ్య బీమా కంపెనీలు కీమోథెరపీ, డయాలసిస్, కంటి ఆపరేషన్, రేడియోథెరపీ, లిథోట్రిప్సీ వంటి డే-కేర్ విధానాలకు సైతం కవరేజీ అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు పరిమితులతో ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్‌కు సైతం కవరేజీ అందించడం ప్రారంభించాయి. అందువల్ల పాలసీ క్లెయిమ్ కోసం ఒక రోజంతా హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం లేదు.
అపోహ 3: కంపెనీలు అందించే హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుంది..
వాస్తవం: కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అనేక సంస్థలు తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ పాలసీని కవర్ చేస్తున్నాయి. కార్పొరేట్ బీమా పథకం ప్రయోజనకరంగా ఉంటుంది కానీ వృద్ధులైన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఆధారపడిన వారికి ఇది పూర్తి కవరేజీని అందించదు. పెద్ద ఆసుపత్రిలో చేరినప్పుడు, ఈ పాలసీలు అందించే కవరేజీ మొత్తం సరిపోకపోవచ్చు. అందువల్ల వీటికి అదనంగా ఎక్కువ బీమా కవరేజీ అందించే పాలసీ తీసుకోవాలి.
అపోహ 4: ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం సురక్షితం కాదు..
వాస్తవం: డిజిటలైజేషన్ తరువాత చాలా సంస్థలు సెక్యూర్డ్ మోడ్‌లో ఆన్‌లైన్లోనే హెల్త్ పాలసీలను అందిస్తున్నాయి. డిజిటల్ విధానంలో మీడియేటర్ల అవసరం ఉండదు కాబట్టి వినియోగదారులకు పాలసీ ఖర్చు కూడా తగ్గుతుంది. చాలా కంపెనీలు ఆన్‌లైన్ పాలసీ కొనుగోళ్లపై డిస్కౌంట్ సైతం అందిస్తున్నాయి. వీటితో పాటు సెక్యూర్డ్ పేమెంట్ గేట్‌వేలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, డేటా ప్రైవసీకి భరోసా ఇస్తున్నాయి. అందువల్ల ఎలాంటి అనుమానం లేకుండా ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు.
అపోహ 5: తక్కువ ధరలో లభించేవే బెస్ట్ పాలసీలు
వాస్తవం: చాలా మంది వ్యక్తులు కేవలం ఖర్చు ఆధారంగానే పాలసీలను ఎంచుకుంటారు. ఇది సరికాదు. ప్రీమియం తక్కువగా ఉండే పాలసీల కవరేజీ కూడా తక్కువగానే ఉంటుంది. ఖర్చు అనేది ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ.. ఫీచర్లు, వెయిటింగ్ పీరియడ్, కో-పేమెంట్ వంటి అన్ని కీలక అంశాలను పాలసీని ఎంచుకోవడంలో పరిగణనలోకి తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid health insurence, Health