FIRST TESLA RESEARCH CENTRE IN INDIA COULD SOON BE IN BENGALURU SECOND IN THE WORLD AFTER US NK GH
Tesla Cars: త్వరలో భారత్‌కు టెస్లా కార్ల కంపెనీ... అమెరికా తర్వాత ఇక్కడే...
త్వరలో భారత్‌కు టెస్లా కార్ల కంపెనీ... అమెరికా తర్వాత ఇక్కడే...
Tesla Cars in India: కేంద్ర ప్రభుత్వం కోరుతున్నట్లే... ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. టెస్లా కార్ల కంపెనీ ఏం చేయబోతోందో తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపు భారతదేశంపై ఉంది. తగినంత మార్కెట్, పెట్టుబడులకు అనుకూలించే వాతావరణం ఇక్కడ ఉండటంతో చాలా దేశాలు భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ... బెంగళూరులో తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే అమెరికా తర్వాత టెస్లా పరిశోధనా కేంద్రం ఉన్న రెండో దేశం భారత్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఎకనమిక్ టైమ్స్ ఓ రిపోర్ట్ ప్రచురించింది. దాని ప్రకారం టెస్లా కంపనీ... కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాధికారులతో చర్చించిందట. టెస్లా ప్రతినిధులు, ఆ రాష్ట్ర అధికారులతో సెప్టెంబరు 10న సమావేశం జరిగిందనీ, రెండో సమావేశం ఈ నెలాఖరులో ఉంటుందని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. ఈ రెండో సమావేశంలో టెస్లా ప్రతినిధులకు వివరణాత్మక ప్రెజంటేషన్‌ను రాష్ట్ర అధికారులు ఇవ్వనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ వర్గాల సమాచారం. పరిశోధన కేంద్రాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్రతినిధులు శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దేశీయ, విదేశీ మార్కెట్లకు బెంగళూరు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. మహేంద్ర ఎలక్ట్రిక్, బాస్చ్ లాంటి సంస్థలతో పాటు సన్ మొబిలిటీ, ఏథర్, ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టార్టప్‌లు కూడా అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల విధానంలో చొరవ చూపి ముందడుగు వేసిన తొలి రాష్ట్రం కర్ణాటకే. నివేదికల ప్రకారం దాదాపు రూ.31 వేల కోట్ల పెట్టుబడులను ఎలక్ట్రిక్ వాహనాల పరిశోధన, అభివృద్ధి, తయారీలపై పెట్టాలని టెస్లా యోచిస్తున్నట్లు తెలిసింది.
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. 2025 నాటికి భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా రూ.50 వేల కోట్లకు చేరుకుంటుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం రూ.50 వేల కోట్ల లక్ష్యంలో రూ.15 కోట్లు... వాహనాల విడి భాగాలైన బ్యాటరీ, కంట్రోలర్, మోటార్ల నుంచి రానుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో భారత్‌లో 30 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయని నివేదికలు చెబుతున్నాయి. వాటిలో ఎక్కువగా టూ-వీలర్లు, త్రీ-వీలర్లే ఉండనున్నాయి. దీని బట్టి చూస్తుంటే స్వచ్ఛ ఇండియాగా మారేందుకు... ఎలక్ట్రిక్ వాహనాల్ని ఆహ్వానించడం ప్రస్తుతం మంచి అవకాశంగా అనుకోవచ్చు.
ఇప్పటికే ఇండియాలో... చాలా మంది ఎలక్ట్రిక్ బైకులు, స్కూటీలు కొనుక్కుంటున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా... అంతర్జాతీయ ఒప్పందాల్ని అనుసరించి... పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు... సరికొత్త వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే... BS4 ఇంజిన్లకు గుడ్ బై చెప్పి... BS6 వాహనాల్ని మాత్రమే అనుమతించింది. టెస్లా కంపెనీ ఇండియాలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే... మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇండియావైపు చూసే ఛాన్సుంటుంది. తద్వారా భారతీయులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.