దేశంలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంతో వీటితో నడిచే వాహనాల్లో ప్రయాణించాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. అదే సమయంలో దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్స్ (Automobiles) సంస్థలు వీటికి ప్రత్యామ్నాయ మార్గమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీపై దృష్టి పెట్టాయి. టూ వీలర్ (Two wheeler) కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై మరింత దృష్టి పెట్టగా... టీవీఎస్, బజాజ్‌లు ఇప్పటికే తమ బ్రాండ్‌లను మార్కెట్‌లోకి వదిలాయి. క్యాబ్ సేవలతో భారత్‌లో అడుగుపెట్టి, ఆఫర్లతో యువతను తన వైపు తిప్పుకున్న ఓలా... టూ వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టింది. బెంగళూరులోని తన ఫ్యాక్టరీలో వీటిని తయారు చేసింది. బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీలు కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన స్టాజెన్ ఈ స్కూటర్‌ను దక్కించుకున్న తొలి ఓలా కస్టమర్ (Customer) అయ్యాడు. దీని గురించి ఆయన చెప్పిన వివరాలు తెలుసుకుందాం.
ఓలానే ఎందుకు...
మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నా స్టాజెన్ ఓలానే ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే... స్కూటర్‌ను ఒకసారి చార్జ్ చేస్తే 130 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. అందుకు తనకు అయ్యే ఖర్చు కేవలం రూ. 24 రూపాయలే. అంతేకాకుండా స్కూటర్ లుక్ చాలా కొత్తగా ఉంది. అందుకే తాను బుకింగ్స్ ఆరంభం కాగానే బుక్ చేశానని చెప్పారు.
బుకింగ్, డెలివరీపై...
మొదట రూ.499 రూపాయలు పెట్టి టాప్ మోడల్ (Model) ఎస్1 ప్రొను ఆన్‌లైన్ (Online)లో అందరిలానే స్టాజెన్ కూడా బుక్ చేశారు. అయితే ఆన్‌లైన్‌లో అతడికి లోన్ లభించకపోవడంతో చేతి నుంచే డబ్బును పెట్టుకోవల్సి వచ్చింది. అంతేకాకుండా డెలివరీ డేట్స్‌లో కూడా చాలా సార్లు మార్పులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. కాస్త గందరగొళంగా.. వాయిదా పడుతూ వచ్చినా చేతికి స్కూటర్ దక్కినందుకు ఆనందంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
క్వాలిటీ (Quality) గురించి
ఆన్‌లైన్ బుక్ చేసేటప్పుడు ఆడుకునే బొమ్మలా ముద్దుగా కనిపించిందని స్టాజెన్ అన్నారు. అయితే క్వాలిటీ పరంగా ఎటువంటి సమస్యలు తనకు ఎదురవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
తాళం లేదు... అంతా టెక్నాలజీతోనే
మీరు ఎదైనా వెహికిల్‌ను నడపాలంటే ముందుగా దానికి తాళం పెట్టి ఇంజిన్ (engine)ను ఆన్ చేస్తారు. కానీ ఓలా స్కూటర్‌కు మాత్రం అలా కాదు. దీనికి తాళమే ఉండదు. స్కూటర్‌ను ఆన్ చేయాలంటే కోడ్‌ను ఉపయోగించాల్సిందే. టచ్ స్క్రీన్ ద్వారా మీరు కోడ్‌ను ఎంటర్ చేసి స్కూటర్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా స్కూటర్‌పై ఉన్న టచ్ స్క్రీన్ ఆఫ్ కాకుండా పని చేస్తూనే ఉం టుందని ఆయన తెలిపారు.
ఫస్ట్ రైడ్ ఎక్స్‌పీరియన్స్
రైడింగ్ చాలా స్మూత్‌గా సాగిందని స్టాజెన్ తెలిపారు. వాహనాల ఇంజిన్‌ను ఆన్ చేయగానే మోటార్ శబ్ధం వినిపిస్తుంది. కానీ ఓలా ఎలక్ట్రిక్ కాబట్టి సౌండ్‌కు ఆస్కారమే లేదని ఆయన అన్నారు. వాహనాన్ని మొత్తం మూడు మోడ్స్‌లో రన్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అందులో ఒకటి హైపర్ మోడ్ రెండోది స్పోర్ట్స్, మూడోది నార్మల్. స్కూటర్ మైలేజి పెరగాలంటే నార్మల్ మోడ్ ఉత్తమమని ఆయన అన్నారు. అయితే స్కూటర్ బెస్ట్ పర్ఫామెన్స్ హైపర్ మోడ్ డెలివరీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
3.97 కిలోవాట్ల బ్యాటరీని చార్జ్ చేయాలంటే నాలుగు యూనిట్ల కరెంట్ అవసరమని ఆయన తెలిపారు. యూనిట్‌కు ఆరు రూపాయల చొప్పున 100 శాతం చార్జ్ చేయడానికి తనకు రూ.24 రూపాయలు ఖర్చు కాగా.. 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించానని ఆయన తెలిపారు. ఇప్పటికైతే స్కూటర్ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు స్టాజెన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.