ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో టాప్ కంపెనీ పేరు ఏది అంటే? అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు టెస్లా అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో అనేక రికార్డులను తన పేరు మీద లికించుకుంది. అయితే, ఇలాంటి టెస్లాకు గట్టిపోటీ ఇవ్వాలంటే ఎలక్ట్రిక్ కార్లలో రేంజ్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎలక్ట్రిక్ కార్లల్లో రేంజ్‌ను ముఖ్యంగా భావించిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఈవీ కార్ల ఉత్పత్తిలో ఒక ముందడుగు వేసింది. ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ విషయంలో మెర్సిడెజ్ బెంజ్ సంచలన విజయాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 1,000 కిమీ దూరం వెల్లనుంది. ఈ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది జనవరి 3 మెర్సిడెజ్ ఆవిష్కరించనుంది. మెర్సిడెజ్ విజన్ ఈక్యూఎక్స్‌ఎక్స్ కాన్సెప్ట్ కారుకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్ ఫీచర్‌తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా విజన్ ఈక్యూఎక్స్‌ఎక్స్ నిలుస్తోందని కంపెనీ సీవోవో మార్కస్ స్కాఫర్ వెల్లడించారు.
మెర్సిడెస్ కొత్త ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కారు ఈక్యూఎస్ ప్రారంభ పరీక్షలలో ఎలోన్ మస్క్ టెస్లా కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చింది. 2022 మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో422 మైళ్లు ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది.
Ola నుంచి త్వరలో కార్ల ఉత్పత్తి...
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. ఈ సంస్థ ఇప్పటికే ఈ–స్కూటర్‌ను లాంచ్ చేసి అమ్మకాలను కూడా ప్రారంభించింది. వీటికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పుడు ఇదే జోరుతో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి కూడా సిద్ధమవుతోంది. రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాబోయే రెండేళ్లలో.. అంటే 2023 నాటికి ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాం. ఇప్పటికే ఈ–స్కూటర్ మార్కెట్లో విజయం సాధించాం. ఇక దేశీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై పనిచేస్తాం” అని అన్నారు. అయితే కంపెనీ ప్రణాళికల గురించి సమాచారాన్ని మాత్రం పంచుకోలేదు.
ఓలా ప్రస్తుతం ఫోర్ వీల్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించనప్పటికీ.. ఓలా క్యాబ్స్ మాత్రం అనేక నగరాల్లో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ క్యాబ్‌లను నడుపుతోంది. అంతేకాదు, ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ హబ్‌లను కూడా నిర్వహిస్తోంది. ఓలా ప్రస్తుతం తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంట్‌ను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది. ఇక్కడే తన భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది. ఈ కేంద్రానికి సమీపంలో సప్లయర్ పార్కును నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mercedes-Benz