కొన్నివిషయాలలో మనం ఎంత ముదుకు వెళ్ళినా మరికొన్నింటిని అసలు పట్టించుకోం. అలా పట్టించుకోని అంశాలలో మహిళల వాష్‌రూమ్‌లు మొదటి స్థానంలో ఉంటాయి. ఏ ఊళ్ళో అయినా మగవారికి ఉన్నన్ని వాష్‌రూమ్‌లు ఆడవారికి ఉండవు.దేశవ్యాప్తంగా ఈ దుస్థితి కొనసాగుతూనే ఉంది. వీలైనన్ని ఎక్కువ వాష్‌రూమ్‌ల నిర్మాణానికి ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు అమలుచేస్తున్నప్పటికీ ఇంకా ఈ సమస్య తీరడం లేదు. మెట్రో నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువుంది.హైదరాబాద్‌లాంటి మహానగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో శుభ్రంగా ఉండే వాష్‌రూమ్ కనుగొనడం అంత తేలిక కాదు. ఈ కష్టాన్ని స్వయంగా అనుభవించిన ఓ మహిళ ఇప్పుడు మహిళందరికీ ఉపయోగపడే ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ ఆలోచన పేరు ‘మొబైల్ షీ టాయిలెట్స్’. వైజాగ్ నుంచి వచ్చిన సుష్మ ఐటీరంగంలో పనిచేసేవారు. ఆమె బహిరంగ ప్రదేశాలలో శుభ్రమైన టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడం వలన చాలామంది మహిళల్లానే తానూ ఇబ్బంది పడ్డారు. మహిళలకు కేటాయించిన టాయిలెట్స్ నిర్వహణాలోపంతో అశుభ్రంగా ఉండటం వలన వాటిని వాడలేని పరిస్థితి. తగినన్ని వాష్‌రూమ్‌లు లేకపోవడం, ఉన్నవి శుభ్రంగా లేకపోవడం. ఈ రెండు అంశాలను గమనంలోకి తీసుకున్నారు సుష్మా. ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానంపై ఆమె పరిశోధన చేశారు.
తొలుత ఆమె మహిళలకు శానిటరీ నాప్కీన్లు అందివ్వాలనుకున్నారు. అయితే అప్పటికే ఆ పని చాలా సంస్థలు చేస్తున్నందున కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా మొబైల్ షీ టాయిలెట్ అనే ఆలోచన తట్టింది. రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ వాహనాలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని సుష్మా భావించారు. ఈ ఆలోచన వచ్చిందే తడువుగా దీని అమలు కోసం ఆమె ఇటు జీహెచ్ఎంసీ, అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా నిధులు సమకూర్చమని పలు కార్పొరేట్ కంపెనీలను అభ్యర్థించారు. ఇక ఈమె ఆలోచన ఆచరణగా మారేందుకు టిఎస్ఆర్టిసి,జిహెచ్ఎంసి ముందుకొచ్చాయి. వాటి సహకారంతో ఓ రెండుపాత వాహనాలను మొబైల్ వాష్‌రూమ్‌లుగా మార్చారు.ఇదే విధంగా, రాబోయే ఆరు నెలల్ల్లోలో 25 మొబైల్ షీ మరుగుదొడ్లను జీహెచ్ఎంసీకి అప్పగిస్తానని సుష్మా చెబుతున్నారు.
ఆటో రిక్షాల్లో ఒకసారి ఒకమనిషి మాత్రమే ఉపయోగించే విధంగా వీటిని తయారు చేస్తారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ వాహనాలను ఆపి రీఛార్జ్ చేయవచ్చు. ఇవి సైజులో చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఈ ఆటోలను ఎక్కడైనా సులభంగా పార్క్ చేసుకోవచ్చు. మహిళలందరూ వీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ వాహనాన్నిమహిళలే నడుపుతారు.వారే నిర్వహిస్తారు. "ఈ వాహనాల్లో జిపిఎస్ ట్రాకింగ్ పరికరాలు, శానిటరీ నాప్కిన్ డిస్పెన్సర్లు, డైపర్ మార్చుకునే అవకాశం, పవర్ ఛార్జింగ్ సాకెట్లను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది అంటారు సుష్మా.
100 లీటర్ల వ్యర్థాలను తీసుకెళ్ళగల మరుగునీటి వ్యవస్థ, ఎగ్జాస్ట్ సిస్టమ్, హ్యాంగర్, అద్దం, ఫ్లష్, వాష్‌బేసిన్ ఈ మొబైల్ టాయిలెట్స్‌లో ఉంటాయి. నాలుగులక్షల రూపాయల ఖర్చు అయ్యే ఈ ఆటో రిక్షాను సుష్మా కుటుంబమే తయారుచేస్తుంది.
వీరికి ఎలక్ట్రికల్ వాహనాల తయారీ వ్యాపారం ఉంది. ఈ ప్రయత్నం అటు మహిళల ఇబ్బందులను తొలగించడమే కాదు, వారి గౌరవాన్ని కాపాడటంతోపాటు వారికి ఉపాధి అవకాశాలూ కల్పించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending