హోమ్ /వార్తలు /బిజినెస్ /

Air India-Tata Group: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ లాభాల్లోకి తీసుకువస్తుందా?

Air India-Tata Group: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ లాభాల్లోకి తీసుకువస్తుందా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఎన్నో వ్యాపారాల్లో విజయం సాధించినా టాటా గ్రూప్.. ఎయిర్ ఇండియాను కూడా లాభాల పటిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

ఎట్టకేలకు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను (Air India) చేజిక్కిచ్చుకుంది. ఎయిర్ ఇండియా బిడ్‌ను టాటా సన్స్ (Tata Sons) గ్రూప్ సొంతం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఇంతకు ముందు ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టిన ఈ సంస్థ.. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌ను విజయవంతంగా నడపడంపై, దాన్ని టాటా గ్రూప్‌లోని ఇతర క్యారియర్‌లతో విలీనం చేయడంపై దృష్టి పెట్టనుంది. ఈ క్రమంలో మొత్తం మూడు అంశాలపై అందరి దృష్టి కేంద్రీకృతమవుతోంది. బ్రాండింగ్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, రూట్ రేషనలైజేషన్ వంటి అవరోధాలను టాటా గ్రూప్‌ ఎలా నిర్వహించనుందని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

బ్రాండింగ్


ఈ విజయంతో టాటా గ్రూప్ మొత్తం నాలుగు బ్రాండ్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా బ్రాండ్‌లు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, విస్తారా ఫుల్ సర్వీస్ క్యారియర్లు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా తక్కువ ధరకే సేవలందించే లో-కాస్ట్ క్యారియర్లు. టాటా గ్రూప్ 2013లోనే ఎయిర్ ఏషియా బీహెచ్‌డి భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియాను స్థాపించింది. అదే సంవత్సరం సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో విస్తారాను స్థాపించింది.

టాటా గ్రూప్.. ఎయిర్ ఏషియా ఇండియాలో తన వాటాను 80 శాతానికి పైగా పెంచింది. దీంతో సంస్థ ఈ ఎయిర్‌లైన్‌ను ఎయిర్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌తో రీబ్రాండ్ లేదా విలీనం చేయవచ్చు. ఇంటిగ్రేషన్ పూర్తయ్యే వరకు ఎయిర్ ఏషియా ఇండియా కేవలం ఆపరేటింగ్ క్యారియర్‌గా ఉండవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మార్కెటింగ్ క్యారియర్‌గా ఉండవచ్చు.

అయితే విస్తారా, ఎయిర్ ఇండియాల విషయంలో ఇలాంటి ప్రణాళికలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఎయిర్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. విస్తారా సేవలు ఇంకా తొలి దశలోనే ఉన్నాయి. ఈ విభాగం అంతర్జాతీయ నెట్‌వర్కింగ్‌కు ఇంకొంత సమయం పడుతుంది. అప్పటి వరకు రెండు విమానయాన సంస్థలు విడివిడిగా టాటా గ్రూప్స్ నుంచి పనిచేస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఎయిర్ ఇండియా, విస్తారా నెట్‌వర్క్‌లను విలీనం చేయడం అతిపెద్ద సవాలు. విస్తారా అనేది ప్రపంచానికి తెలియని తాజా బ్రాండ్. ఎయిర్ ఇండియా అనేది ఇప్పటికే ప్రపంచానికి తెలిసిన మేటి బ్రాండ్. లెగసీ IATA కోడ్ "AI" సైతం దీని సొంతం కావడం గమనార్హం.

ప్రస్తుతం ఎయిర్ ఏషియా ఇండియాకు అంతర్జాతీయంగా ప్రయాణించే హక్కులు లేవు. ఎయిర్ ఇండియా స్టార్ అలయన్స్‌లో (Star Alliance) భాగం కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం మెంబర్ కాదు. ఈ రెండు ఎయిర్ ఇండియా బ్రాండ్‌లు ఒకదానితో ఒకటి కోడ్ షేర్ చేసుకోవు.. లేదా ఇన్వెంటరీలను క్రాస్-సేల్ చేయలేవు. ఇవన్నీ టాటా గ్రూప్ ముందున్న సవాళ్లే.

సిస్టమ్స్ ఇంటిగ్రేషన్


ఇండియన్ ఎయిర్‌లైన్స్-ఎయిర్ ఇండియా విలీనం సందర్భంలో ఎదురైన అడ్డంకుల నేపథ్యంలో.. తాజాగా ఉద్యోగుల ఏకీకరణపై సంస్థ ఎక్కువ దృష్టి కేంద్రీకరించనుంది. అయినా సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ అనేది క్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. విమానయాన సంస్థలు సంక్లిష్టమైన IT సిస్టమ్స్‌పై నడుస్తాయి. ఇందులో ప్లానింగ్, రెవెన్యూ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ కంట్రోల్, క్రూ రోస్టరింగ్, కాంప్లెక్స్ రిజర్వేషన్ సిస్టమ్స్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు ఎయిర్‌లైన్స్‌లో ఇలాంటి బహుళ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని ఒకే వ్యవస్థ లేదా రెండు వ్యవస్థలకు మార్చడం సవాలుగా మారనుంది.

రూట్ రేషనలైజేషన్


ఎయిర్‌లైన్స్‌కు రూట్ ఓవర్‌ల్యాప్ అనేది పెద్ద సమస్య. ఈ సమస్యను సంస్థలు క్రమబద్దీకరించుకోవాలి. ఒకే మార్గంలో నిమిషాల వ్యవధిలో రెండు విమానాలను నడపాలని ఏ సంస్థ భావించదు. ఇలాంటి సమస్యలను నివారించడానికి, ఫ్లైట్ స్పేసింగ్‌ను సమన్వయం చేయడానికి అంతర్గత, బయటి బృందాలతో పని చేయాల్సి ఉంటుంది. సంస్థలో వేర్వేరు రెవెన్యూ మేనేజ్‌మెంట్ బృందాలు సైతం ఒకదాన్ని ఆదాయాన్ని మరొకటి ప్రభావితం చేయకుండా సమన్వయం చేసుకోవాలి. రూట్ ఓవర్‌ల్యాపింగ్‌ను నివారించడం అనేది ఒక్కరోజులో జరిగే పని కాదు.

అభిరుచితో లాభాలు వస్తాయా?


వారసత్వ అభిరుచితోనే టాటా గ్రూప్ అనేక దశాబ్దాల తర్వాత తిరిగి విమానయాన రంగంలోకి ప్రవేశించింది. కానీ ఈ అభిరుచి విమానయాన రంగంలో లాభాలను తీసుకువస్తుందా అనేది ప్రశ్నార్థకం. ఇందుకు సమర్థవంతమైన వ్యాపారాభివృద్ధి ప్రణాళికలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే టాటా గ్రూప్‌లోని అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు సజావుగా విలీనం కావడానికి మరో నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది. అంతకు ముందు టాటా గ్రూపు సామర్థ్యాన్ని అంచనా వేయడం పొరపాటేనని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

First published:

Tags: Air India, Ratan Tata

ఉత్తమ కథలు