గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల రవాణా మార్గాలపై ప్రభుత్వాలు దృష్టిసారించడం వల్ల వీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలు వృద్ధి చేస్తే ఎలక్ట్రిక్ బైక్‌ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా మీ తండ్రికి పెట్రోల్ బాధల నుంచి విముక్తి కల్పించాలంటే, మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ గిఫ్ట్ ఇవ్వండి. ఇప్పటి వరకు దేశంలో మంచి గుర్తింపు దక్కించుకున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా
భారత్‌లో ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో సంస్థకు ఎక్కువ మార్కెట్ ఉంది. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయడంలో ముందుండే ఈ కంపెనీ ఇంతకు ముందే ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ ప్రారంభించింది. వివిధ రకాల బడ్జెట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లను హీరో సంస్థ అందిస్తుంది. వీటిలో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. దీంట్లో 550-1200 W మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఐదు గంటలు పడుతుంది. ఈ వేకిల్ STD, ER అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
ఎనిగ్మా క్రింక్
ఎనిగ్మా సంస్థ భారత్‌లో అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. అన్మోల్, అలంకృత భోరే అనే ఇద్దరు సోదరులు 2016లో ఈ సంస్థను ప్రారంభించారు. దేశంలో తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించాలనే ఉద్దేశంతో వీరు కంపెనీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఎనిగ్మా క్రింక్, GT450, అంబర్ పేరుతో మూడు వేరియంట్లను అందిస్తోంది. ఈ మూడు వేరియంట్లలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో శక్తిమంతమైన లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. స్కూటర్లలో ఉండే 250W BLDC మోటార్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆ తరువాత వీటిపై 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
GoGreenBOV
గో గ్రీన్ బీఓవీ అనేది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. గో గ్రీన్ ఈఓటీ నుంచి దీన్ని 2011లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మెరుగైన బ్యాటరీలతో ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందిస్తోంది. ప్రతి సంవత్సరం కాలుష్యాన్ని కనీసం ఒక డిగ్రీ తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ రూపొందించిన కవచ్, సునోతి, కిమాయ వంటి స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఈవీ ఇండియా (EeVe India)
ఈవీ ఇండియా కూడా ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ టూ-వీలర్లను తయారు చేస్తోంది. భారత మార్కెట్‌కు సరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లను సంస్థ రూపొందిస్తోంది. యుటిలిటీ, స్టైల్, లగ్జరీ అవసరాల కోసం వాహనాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తోంది. ప్రస్తుతం అట్రియో, అహావా, జెనియా, విండ్, 4U, యువర్ వంటి ఆరు వేరియంట్లను ఈవీ ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.
టీవీఎస్ ఐక్యూబ్
టీవీఎస్ బ్రాండ్ నుంచి వచ్చిన అత్యున్నతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి. స్టైల్, పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా దీన్ని రూపొందించారు. ఈ స్కూటర్‌పై గంటకు 78 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఛార్జింగ్ కేబుల్‌ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ప్రయాణ వేగం రోజుకు 30 కి.మీ వరకు ఉంటే, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసుకొని రెండు రోజుల వరకు వాడుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bikes, Electric Bikes