2016లో ఉన్నపళంగా పెద్దనోట్లను రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాత 500, 1000 నోట్లను తొలగించి.. కొత్తగా 2వేల నోట్లను పరిచయం చేసింది. ఆ తర్వాత 500, 200, 100, 50, 20, 10 నోట్లను కూడా కొత్త రూపంలో తీసుకొచ్చింది. ఐతే తాజాగా కరెన్సీకి సంబంధించిన ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చి లేదా ఏప్రిల్ లోగా ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందని ప్రచారం జరుగుతోంది. మార్చి తర్వాత ఈ నోట్లు కనిపించబోవని కథనాలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.
పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లు సర్క్యులేషన్లో ఉండబోవన్న వార్తలను కొట్టిపారేసింది. ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఈ నోట్లకు సంబంధంచి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
ఫేస్బుక్, ట్విటర్లో గంటకో ఇలాంటి పుకారు షికారు చేస్తోంది. వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా సందేశాలు వస్తున్నాయి. అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:January 24, 2021, 20:10 IST