Home /News /business /

EXPLAINED WHO IS GAINING FROM THE SHARP RISE IN FUEL PRICES MK GH

Explained: Fuel Prices: పెట్రోల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలేంటి? అధిక ధరలతో లాభపడేది కేంద్రమా, రాష్ట్రమా? పూర్తి విశ్లేషణ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

గత ఏడాది మార్చిలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు.. వినియోగదారులకు ఆ మేరకు ప్రయోజనాన్ని అందించడానికి బదులుగా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఫలితంగా లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.19.98 నుంచి రూ.32.90 వరకు.. లీటరు డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.80 వరకు పెరిగింది.

ఇంకా చదవండి ...
దేశంలో పెట్రో ధరల పెంపు కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. రానున్న రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టేలా కనిపిస్తోంది. ఇంధన ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే అవకాశాలు ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. కరోనా తరువాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీనికి తోడు మనం వినియోగించే ఫ్యూయెల్‌లో 80 శాతాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితికి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు సైతం కారణమవుతున్నాయి తెలిపారు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఈ క్రమంలో ప్రస్తుతం పెట్రోల్ ధరల పెరుగుదలకు దోహదపడే అంశాలు, దీని వల్ల ఎవరు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే విషయాల గురించి తెలుసుకుందాం.

చమురు ధరలు నిరంతరం పెరగడానికి కారణం?
గత కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ముంబైలో పెట్రోల్ ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.105 వరకు, డీజిల్ రూ.95.72 వరకు పెరిగింది. ఇతర మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు రూ.100కు చేరుకున్నాయి. అయితే స్థానిక పన్నులు ఎక్కువగా ఉన్నందువల్ల, ముంబైలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినట్లు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గత సంవత్సరంలో చాలా వరకు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు 119 శాతం మేర పెరిగాయి. 2020 మే నెలలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 30.61 డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది మేలో ఇది 66.95 డాలర్లకు పెరిగింది.

2020 ఏప్రిల్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్.. ఒక బ్యారెల్‌కు 19 డాలర్లకు పడిపోయింది. మహమ్మారి కారణంగా వివిధ దేశాల్లో విధించిన లాక్‌డౌన్, ప్రయాణ ఆంక్షలు, ఇతర పరిమితుల వల్ల అప్పట్లో ఇంధన అవసరాలు, డిమాండ్ తగ్గిపోయాయి. కానీ ఈ ఏడాది జూన్ 23 నాటికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75.32 డాలర్ల వరకు పెరిగింది. గత రెండేళ్లలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.

ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నాయి?
గత ఏడాది మార్చిలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు.. వినియోగదారులకు ఆ మేరకు ప్రయోజనాన్ని అందించడానికి బదులుగా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఫలితంగా లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.19.98 నుంచి రూ.32.90 వరకు.. లీటరు డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.80 వరకు పెరిగింది. ఈ పన్నుల పెరుగుదల కూడా ఇంధన ధరలు పెరగడానికి కారణమైంది. ప్రస్తుతం పెట్రోల్ రిటైల్ ధరలో కేంద్ర, రాష్ట్రాల పన్నుల వాటా 55 శాతం.. డీజిల్‌ రిటైల్ ధరలో పన్నుల వాటా 51 శాతంగా ఉన్నాయి. ఈ పన్నులతో పాటు సరకు రవాణా ఛార్జీలు, డీలర్ కమీషన్ కలిపి రిటైల్ ధరలను నిర్ణయిస్తారు.

మొత్తం ఇంధన ధరలపై విధించే ట్యాక్స్‌లో కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కస్టమ్స్ సుంకం రేట్లు 2.5 శాతంగానే ఉన్నాయి. దీంతోపాటు కస్టమ్ డ్యూటీపై సోషల్ వెల్‌ఫేర్ సర్‌చార్జిని మూడు నుంచి 10 శాతానికి పెంచింది.

అధిక ధరలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో దేనికి ఎక్కువ ఆదాయం వస్తుంది?
గత ఐదేళ్లలో పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం వసూళ్లు భారీగా పెరిగాయి. 2014-15లో ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం రూ.29,279 కోట్లుగా ఉండగా.. 2019-20 నాటికి ఇది ఏకంగా 167 శాతం పెరిగి రూ.78,230 కోట్లకు చేరుకుంది. గత ఏడాది పన్నుల పెరుగుదల కారణంగా.. 2020-21 ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో వసూలైన ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం రూ.89,575 కోట్లకు పెరిగింది.
ఇదే సమయంలో డీజిల్‌పై వస్తోన్న ఆదాయం కూడా భారీగానే పెరిగింది. 2014-15లో డీజిల్‌పై వసూలైన ఎక్సైజ్ డ్యూటీ విలువ రూ.42,881 కోట్లుగా ఉంది. 2019-20 నాటికి ఎక్సైజ్ సుంకం వసూళ్లు దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.1,23,166 కోట్లకు చేరుకోవడం గమనార్హం. 2020-21 ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇది ఏకంగా రూ.2,04,906 కోట్లకు పెరిగింది.

రాష్ట్రాలు సైతం వనరులు, మౌలిక సదుపాయాల కల్పనను పెంచడానికి చమురు ధరలను పెంచాయి. వ్యాట్ వంటి స్థానిక పన్నులు, రాష్ట్రాల్లో సరకు రవాణా ఛార్జీలను బట్టి ఇంధన ధరలు ఉంటాయి. ఈ ట్యాక్స్ రేట్లలో తేడాలు ఉన్నందువల్ల చమురు ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటున్నాయి. ప్రస్తుతం మన దేశంలో రాజస్థాన్.. పెట్రోల్, డీజిల్‌పై అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తుంది. ఆ తరువాత మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ధరలను తగ్గించేందుకు ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, మేఘాలయ వంటి రాష్ట్రాలు చమురుపై పన్ను తగ్గించాలని నిర్ణయించాయి.

చమురు ధరలపై రాష్ట్రాలు కూడా మెరుగైన ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ (PPAC) డేటా చెబుతోంది. పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్‌లపై విధిస్తున్నసేల్స్ ట్యాక్స్, వ్యాట్ ద్వారా రాష్ట్రాల ఖజానాకు వస్తున్న ఆదాయం 46 శాతం పెరిగింది. దీన్ని బట్టి చూస్తే.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా విధిస్తున్న పన్నులు, సుంకాల వల్ల ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

చమురును జీఎస్‌టీ కిందకు తీసుకువస్తే, ధరలు భారీగా తగ్గుతాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కానీ దీనిపై కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ స్పందించట్లేదు. కరోనా తదనంతర పరిస్థితుల కారణంగా డీలా పడిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, పడిపోతున్న వృద్ధి రేటును కాపాడుకోవడానికి, టీకాలకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడానికి.. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఉపయోగపడుతుందని మరికొందరు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహమ్మారి తరువాత రాష్ట్రాల ఆర్థిక వనరులు సైతం దెబ్బతిన్నాయి. అందువల్ల ప్రస్తుతం అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రాలు కానీ చమురుపై ట్యాక్స్‌లు, సుంకాలు తగ్గించే పరిస్థితులు కనిపించట్లేదు. ఫలితంగా రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి.
Published by:Krishna Adithya
First published:

Tags: Petrol prices

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు