గ్యాస్ సిలిండర్ల ధరలు సామాన్యులకు సామాన్యులపై షాకుల మీద షాకులిస్తున్నాయి. సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు సిలిండర్ ధర పెరిగింది. ప్రతీసారి రూ.25 నుంచి రూ.50 మధ్య ధరలు పెంచుతున్నాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా మరో రూ.25 ధరను పెంచాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిన తీరు చూస్తే డిసెంబర్లో గ్యాస్ సిలిండర్ ధర రెండుసార్లు పెరిగింది. రూ.50 చొప్పున రెండుసార్లు మొత్తం రూ.100 పెరిగింది. ఆ తర్వాత జనవరిలో బ్రేక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. హమ్మయ్య... ఇక సిలిండర్ ధర పెరగట్లేదని సామాన్యులు అనుకుంటుండగానే ఫిబ్రవరిలో మరో షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు.
ఫిబ్రవరి 4న సిలిండర్ ధర రూ.25 పెరిగింది. దీంతో హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.771.5 కి చేరుకుంది. ఆ తర్వాత 10 రోజులకే మరో షాక్ తగిలింది. ఫిబ్రవరి 15న గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. దీంతో సామాన్యులు గ్యాస్ సిలిండర్ కోసం రూ.821.5 చెల్లించాల్సి వచ్చింది. సరిగ్గా 10 రోజులకి మూడో షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఫిబ్రవరిలో మూడుసార్లు సిలిండర్ ధరల్ని పెంచి రికార్డ్ సృష్టించాయి. ఫిబ్రవరి 25న గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.25 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.846.5. ఇలా డిసెంబర్ నుంచి 5 సార్లు గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచాయి కంపెనీలు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సిలిండర్ ధర రూ.200 పెరిగింది.
లాక్డౌన్ సమయంలో సిలిండర్ల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. 2020 మే వరకు గ్యాస్ సిలిండర్ల ధరల్లో పెద్దగా మార్పేమీ లేదు. హైదరాబాద్లో గతేడాది మేలో సిలిండర్ ధర కేవలం రూ.590 మాత్రమే. జూన్లో రూ.51 పెరిగింది. దీంతో ధర రూ.641 కి చేరుకుంది. ఇక అప్పట్నుంచి ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. లాక్డౌన్ తర్వాత సిలిండర్ ధర రూ.256.50 పెరిగింది. ఒకేసారి కాకుండా ఏడు విడతల్లో సిలిండర్ ధరను రూ.256.50 పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇంకా ఇలాంటి షాకులు ఎన్ని చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు సామాన్యులు.
పరిస్థితి చూస్తుంటే గత 9 నెలలుగా సిలిండర్ ధర పైపైకి పోతోంది తప్ప కిందకు దిగిరావట్లేదు. మరి భవిష్యత్తులో సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇందుకు పలు కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరల్లో మార్పుల కారణంగానే గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నట్టు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో పాటు మరిన్ని కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం సబ్సిడీని భారీగా తగ్గిస్తోంది. సాధారణంగా సామాన్యులకు సబ్సిడీపై సిలిండర్ వస్తుంది. ఈ సబ్సిడీని భారీగా తగ్గించడంతో గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.40,915 కోట్ల పెట్రోలియం సబ్సిడీని కేటాయించింది. కానీ ఈసారి సబ్సిడీ భారీగా తగ్గిపోయింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేవలం రూ.12,995 కోట్ల పెట్రోలియం సబ్సిడీని మాత్రమే కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం సబ్సిడీని భారీగా తగ్గించడంతో ఆయిల్ కంపెనీలు ఆ లోటు పూడ్చేందుకు గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచుతున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.