అనుకోని దుర్ఘటనల వల్ల ఒక్కోసారి కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ కరోనా (corona) సమయంలో ఆర్థిక భద్రత తప్పనిసరి అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో టర్మ్ బీమా పాలసీ (Term Insurance policy)కి ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అయితే క్లెయిమ్స్ రేటు(claims rate) కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో ఇన్సూరెన్స్ కంపెనీలు (Insurance companies) కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు జారీ చేసేందుకు జంకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ వీలైనంత త్వరగా టర్మ్ పాలసీ తీసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు కారణం త్వరలోనే జీవిత బీమా కంపెనీలు టర్మ్ పాలసీ పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రీఇన్సూరెన్స్ వ్యాపారంలో పెరిగిన ఒత్తిడి కారణంగా జీవిత బీమా కంపెనీల్లో టర్మ్ పాలసీ ప్రీమియంలు 15-25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
కరోనా ప్రభావంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటికే రీ-ఇన్స్యూరర్లు టర్మ్ పాలసీలకు రీఇన్స్యూరెన్స్ రేట్లను సగటున 40-60 శాతం పెంచాయి. అంతేకాదు జీవిత బీమా కంపెనీలకు టర్మ్ లైఫ్ పాలసీల క్రింద రిటెన్షన్ లిమిట్ (retention limit) కూడా రెట్టింపు అయ్యింది. ప్రముఖ బీమాదారుల ప్రకారం, కోవిడ్-19 ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంక్షోభానికి కారణమై ప్రాణనష్టం గణనీయంగా పెంచింది. ప్రస్తుతం ప్రీమియంలు పెరగడానికి కూడా ఇదే కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
"సెకండ్ వేవ్ సమయంలో సెటిల్ చేసిన క్లెయిమ్‌ల సంఖ్య ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉంది. కోవిడ్-19 మరణాల వల్ల క్లెయిమ్‌ల సంఖ్య బాగా పెరగడంతో బీమా సంస్థలు టర్మ్ ప్లాన్ రేట్లను సవరించి ఉండొచ్చు. టర్మ్ ప్రీమియంలు గత 5 - 6 సంవత్సరాలుగా స్థిరంగానే ఉన్నాయి. దీన్నిబట్టి ఇప్పుడు రేట్ సవరించడానికి ప్రధాన కారణం కరోనా అని చెప్పవచ్చు. ఐదారేళ్ల తర్వాత పెంచిన ఈ ప్రీమియం ధరలు విశేషంగా నిలుస్తున్నాయి" అని పలు ఇన్సూరెన్స్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
కరోనా మహమ్మారి రాకతో ప్రజలు తమ ఆరోగ్యం, భద్రత గురించి మరింత స్పృహ పెంచుకున్నారు. ఈ రోజుల్లో ప్రజలు ఎటువంటి రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. "కొత్త ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అనిశ్చితులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో లైఫ్ కవర్‌ను కలిగి ఉండటం గతంలో కంటే చాలా ముఖ్యమైనది. టర్మ్ ప్లాన్ అనేది డబ్బు సంపాదిస్తున్న ప్రతి వ్యక్తికి ఇప్పుడు చాలా ముఖ్యం గా మారింది. అలాగే ఇది ఎల్లప్పుడూ ఆర్థిక ప్రణాళికలో భాగం కావాలి," అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.