వర్షాకాలం రావడంతో ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల వరదలు కూడా మొదలయ్యాయి. ఇక నగరాల్లో వర్షం పడిందంటే ప్రజలకు ఇక్కట్లే. ముఖ్యంగా వాహనాలు, ఇళ్లు దెబ్బతింటుంటాయి. నగరాల్లో రోడ్లపై నీళ్లు భారీ నిలిస్తుండడంతో వాహనాలు చాలా డ్యామేజీ అవుతుంటాయి. కరోనా వల్ల విధించిన లాక్డౌన్లు కూడా ఎత్తేస్తుండడంతో చాలా వెహికల్స్ రోడ్ల మీదకు వస్తున్నాయి. మరోవైపు వర్షాకాలంలో అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎలాంటి కష్టం వచ్చినా భరోసా ఉండేందుకు వానాకాలంలో తప్పకుండా మూడు ఇన్సూరెన్స్ కవర్స్ తీసుకోవడం చాలా మంచిది. అవేంటంటే..
మోటార్ ఇన్సూరెన్స్
వర్షాకాలంలో ఒక్కోసారి ఊహించని పరిస్థితులు ఏర్పడతాయి. భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయాల్లో వాహనాలు.. ముఖ్యంగా కార్లు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అందులోనూ రోడ్లపై కూడా నీరు ఎక్కువ నిలిచే అవకాశం ఉండడం కూడా వాహనాలకు ప్రమాదమే. అందుకే వాహనాలు ఉన్న వారు తప్పనిసరిగా మోటర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇంజిన్ చెడిపోవడం లాంటి ఏదైనా భారీ మరమ్మతులు వచ్చినా.. ఆర్థికంగా కష్టాలు ఎదురవకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పాలసీ తీసుకునే ముందు అన్ని రిపేర్లకు వర్తించేలా ఉండేవి ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అందుకే ఇంజిన్ ప్రొటెక్షన్ రైడర్ సదుపాయం ఉండే కాంప్రెహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలంటున్నారు.
హోమ్ ఇన్సూరెన్స్
భారీ వర్షాలు కురిస్తే ఒక్కసారి ఇళ్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వరద నీటిలో చిక్కుకొని డ్యామేజ్ కావొచ్చు. అలాగే ఇంట్లోని విలువైన వస్తువులు దెబ్బతినొచ్చు. అందుకే ఇంటికి కూడా పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణుల సూచన.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
ముఖ్యంగా వర్షాకాలంలో అందరికీ పూర్తిస్థాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ లాంటి వాటికి గురైతే వైద్యానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక కష్టాలు ఎదురుకావొచ్చు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ ఇంతముందు తీసుకున్నది గడువు ముగిసిపోతే.. రెన్యూవల్ చేసుకునేందుకు ఇదే సరైన సమయం. అయితే కొన్ని వ్యాధులకే ప్రత్యేకమనేది కాకుండా అన్నింటికీ వర్తించేలా పూర్తిస్థాయి కాంప్రెహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కూడా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
ఇన్సూరెన్స్‌లు తీసుకోవడంతో పాటు వాటి డాక్యుమెంట్లను జాగ్రత్తగా దాచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం డిజీ లాకర్ లాంటి అకౌంట్లలో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను సేవ్ చేసుకుంటే మంచిది. డిజీ లాకర్ క్లౌడ్స్టోరేజీలో ఉంచుకోవడం వల్ల డిజిటల్ డాక్యుమెంట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉండదు. క్లయిమ్ చేసుకునే సమయంలో సులభంగా డాక్యుమెంట్లను సమర్పించవచ్చు. అలాగే ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా పూర్తి నియమ, నిబంధనలను తెలుసుకోవాలి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.