కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత భారతదేశంలో రోజు రోజుకూ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. వరుసగా రెండు రోజులుగా డొమస్టిక్ ఫ్లైట్(Domestic Airlines)లలో ప్రయాణికుల సంఖ్య నాలుగు లక్షల మార్కును దాటింది. శనివారం రోజున 4,05,963 మంది, ఆదివారం 4,09,831 మంది చొప్పున ప్రయాణికులు 2,767 విమానాల ద్వారా ప్రయాణించారు. ఇలా వరుసగా రెండు రోజుల పాటు దేశీయ విమానయాన ట్రాఫిక్ 4 లక్షల మార్కును దాటడం 2020 మే నెల తర్వాత ఇదే తొలిసారి. కరోనా(CoronaVirus) ముందు ఉన్న పరిస్థితులలో ఉన్న ప్రయాణికుల సంఖ్యకు ఇది 95 శాతం చేరువలో ఉంది.
* రికార్డు స్థాయిలో ఏవియేషన్ ట్రాఫిక్
దేశంలో రెండున్నర సంవత్సరాల తర్వాత డొమస్టిక్ విమాన ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA డేటా ప్రకారం.. దేశంలో ఈ అక్టోబర్లో దేశీయ విమానయాన సంస్థలు దాదాపు 1.14 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గత ఏడాది ఇదే సమయానికి ప్రయాణించిన వారి సంఖ్య 89.85 లక్షల గానే ఉంది. 2022 జనవరి-అక్టోబర్లో దేశీయ విమానయాన సంస్థల ద్వారా 9.88 కోట్ల మంది ప్రయాణించారు. గత సంవత్సరం ఇదే కాలంలో 6.20 కోట్ల మంది మాత్రమే ప్రయాణించారు. 59.16 శాతం యాన్యువల్ గ్రోత్తో, 26.95 శాతం నెలవారీ గ్రోత్తో ప్రయాణికుల సంఖ్య కనిపిస్తోంది.
* కరోనా ప్రభావం తగ్గడంతో పెరిగిన ప్రయాణాలు
గత రెండు వారాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం కూడా విమాన ప్రయాణికులపై ఆంక్షలను మెల్ల మెల్లగా తొలగిస్తోంది. ఫలితంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంటోంది. విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ అధికారులు, విమానయాన సంస్థల యజమానులు, వాటాదారులతో ఛార్జీల విషయంలో జరిగిన చర్చల తర్వాత ఓ ప్రకటన వెలువడింది. ఏవియేషన్ రెగ్యులేటర్ దేశంలో విమాన ఛార్జీలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ తర్వాత డొమస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ రికవర్ కావడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Wedding Insurance: వివాహ వేడుకకూ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు... రూల్స్ ఇవే
Buy Your First House: లైఫ్లో మొదటి ఇంటిని కొంటున్నారా? ఈ సూచనలు గుర్తుంచుకోండి
* పూర్వ స్థాయికి ఏవియేషన్ రంగం
Covid తర్వాత ప్రయాణికుల సంఖ్యలో మళ్లీ పాత మార్కును చేరుకుంటున్న సూచనలు కనిపిస్తుండటంతో విమానయాన సంస్థలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క ఇండిగో విమానాల్లోనే ఆదివారం రెండు లక్షల యాభై వేల మంది ప్రయాణించారు. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ తెలియజేశారు. దేశీయ విమాన ప్రయాణికులు సంఖ్య నాలుగు లక్షలు దాటడం కొనసాగుతుందని ఏవియేషన్ మినిస్ట్రీ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airlines