ఉద్యోగాలు చేసేవారి జీతం నుంచి కొంత భాగం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు వెళ్తుంది. ప్రతినెలా చేసే ఈ డిపాజిట్లు రిటైర్మెంట్ తరువాత ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ కేవలం ఈపీఎఫ్ కార్పస్ ఒక్కటే రిటైర్మెంట్ అవసరాలకు సరిపోకపోవచ్చు. ట్యాక్స్ పరిధిలోకి రాదు కాబట్టి ఈపీఎఫ్‌లో చేసే డిపాజిట్లను మంచి పెట్టుబడులుగా చెప్పుకోవచ్చు. EPFలో చేసే కాంట్రిబూషన్, వడ్డీ, విత్‌డ్రాలపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్టుబడి పథకం కాబట్టి భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ EPF అనేది ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్. ఈక్విటీల్లో పెట్టుబడులు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటూ, మంచి రాబడిని ఇవ్వగలవు. EPFలో ఈక్విటీ పరిమితంగా ఉండటం, పెట్టుబడిపై పరిమితులు ఉండటం వల్ల రిటైర్మెంట్ కార్పస్ కోసం వీటిపై పూర్తిగా ఆధారపడలేరు.
ఈక్విటీ పెట్టుబడులు తక్కువ
EPF కార్పస్‌లో ఎక్కువ భాగాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీలు వంటి డెట్ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడులకు కేటాయిస్తారు. దీని నుంచి ఈక్విటీలకు చాలా తక్కువ మొత్తం వెళ్తుంది. అందువల్ల దీంట్లో చేసే పెట్టుబడులు డెట్ ఇన్స్ట్రుమెంట్ల కిందకు వస్తాయి. 2015 నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. అప్పట్లో ఈపీఎఫ్ కార్పస్‌లో ఐదు శాతాన్ని ఈక్విటీలకు కేటాయించారు. 2017లో ఈ లిమిట్‌ను 15 శాతానికి పెంచారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఈటీఎఫ్, భారత్ 22 ఈటీఎఫ్ వంటి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో EPFO పెట్టుబడులు పెట్టింది.
కానీ EPF ఈక్విటీ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని కూడా తట్టుకోలేవు.
వడ్డీ రేట్ల తగ్గుదల
ఇటీవల తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గింది. EPFOలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఈ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. CBTలో యజమాన్యాలు, ఉద్యోగులు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. సాధారణంగా ఈ వడ్డీ రేటు గత సంవత్సరం నుంచి వచ్చిన మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని బట్టి ఉంటుంది. వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకున్న తరువాత, ఆమోదం కోసం నివేదికను ఆర్థిక శాఖకు పంపిస్తారు.
డిపాజిట్లపై పరిమితులు
EPFలో కాంట్రిబూషన్ రూపంలో చేసే డిపాజిట్లపై పరిమితులు ఉన్నాయి. యజమాన్యాలు, ఉద్యోగులు ప్రతి నెలా 12 శాతం చొప్పున EPFలో డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఉద్యోగి జీతం రూ.15,000 కంటే ఎక్కువగా ఉంటే, యజమాని అసలు జీతంపై (బేసిక్ సాలరీ, డియర్నెస్ అలవెన్సులు కలిపి) 12 శాతాన్ని ఈపీఎఫ్‌లో తప్పనిసరిగా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఉద్యోగి జీతంతో సంబంధం లేకుండా కేవలం రూ.15,000పై 12 శాతాన్ని... అంటే రూ.1,800కు మాత్రమే కాంట్రిబూషన్ను పరిమితం చేయవచ్చు. దీనివల్ల ఈపీఎఫ్ రిటైర్మెంట్ కార్పస్ చాలా తక్కువగా ఉంటుంది.
ప్రయోజనాలు తక్కువ
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) ద్వారా EPFలో చేసే కాంట్రిబూషన్ను ఉద్యోగులు పెంచుకోవచ్చు. కానీ చాలా సంస్థలు ఉద్యోగులకు VPF ఆప్షన్‌ను అందించకపోవచ్చు. దీంతోపాటు యాజమాన్య సంస్థలు ఈపీఎఫ్‌కు అందించే కాంట్రిబూషన్లో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌కు వెళ్తుంది. దీనిపై కస్టమర్లకు ఎలాంటి వడ్డీ రాదు. రిటైర్మెంట్ తరువాత దీని నుంచి పెన్షన్ అందుతుంది. కానీ ఇది కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇన్ని పరిమితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని బట్టి చూస్తే రిటైర్మెంట్ కార్పస్ కోసం కేవలం ఈపీఎఫ్ డిపాజిట్లపై ఆధారపడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఈక్విటీలపై దృష్టి పెట్టాలి
ఈపీఎఫ్ వడ్డీ రేట్లు కొంత వరకు తగ్గినప్పటికీ, చిన్న పొదుపు పథకాల్లో ఇది మెరుగైన రాబడినే అందిస్తోంది. అందువల్ల దీన్ని కూడా రిటైర్మెంట్ పెట్టుబడిగా పరిగణించవచ్చు. లాంగ్‌టర్మ్ సేవింగ్స్ స్కీమ్ అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 7.1 శాతం వడ్డీ రేటు మాత్రమే ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగంలో చేరిన కొత్తలోనే రిటైర్మెంట్ ఫండ్ కోసం ఈక్విటీల్లో చేసే పెట్టుబడులను ఎంచుకోవడం మంచిది. దీర్ఘాకాలంలో ఈ పెట్టుబడులు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా తట్టుకొని మంచి రాబడిని అందిస్తాయి. సర్వీస్ పెరుగుతూ, రిటైర్మెంట్ సమయం దగ్గరపడే సమయానికి క్రమంగా ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించుకుంటూ రావడం వల్ల దీర్ఘకాలంలో మంచి కార్పస్ ఫండ్ ఏర్పడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, EPFO, Finance, Personal Finance