ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో డిపాజిట్లు చేసే చందాదారులకు పెన్షన్‌పై అవగాహన ఉండట్లేదని నిపుణులు చెబుతున్నారు. వీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద లభించే అన్ని రకాల ప్రయోజనాలకు అర్హులు. వీటిల్లో పెన్షన్ ప్రధానమైంది. సాధారణంగా ఒక ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుడు తన ప్రాథమిక జీతంలో (బేసిక్ శాలరీ) 12 శాతాన్ని EPF ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం ఇచ్చిన యాజమాన్య సంస్థ కూడా ఉద్యోగి జీతంలో 12 శాతాన్ని వారి EPF అకౌంట్లో జమ చేస్తుంది. ఉద్యోగి, యజమాన్య సంస్థలు తప్పనిసరిగా ఈపీఎఫ్ కాంట్రిబూషన్ చేయాలి. నిబంధనల ప్రకారం ఖాతాదారుడు దీనికి సంబంధించిన వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో పెన్షన్ ఒకటి. కానీ ఈ పెన్షన్‌పై చాలామంది చందాదారులకు అవగాహన ఉండట్లేదు. దీనిపై వినియోగదారులు అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
పెన్షన్‌కు అర్హత ఏంటి?
EPFO పెన్షన్ పొందడానికి ఉద్యోగులు కనీసం 15 సంవత్సరాలు EPF అకౌంట్లో డిపాజిట్లు చేయాలి. ఈ క్రమంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలి. ఒక ఉద్యోగి EPF అకౌంట్‌ను ఓపెన్ చేసిన సమయంలోనే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. యజమాన్య సంస్థ ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేసిన మొత్తంలోని 8.33 శాతం కాంట్రిబూషన్ ఈపీఎస్‌లోకి వెళ్తుంది. మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. అందువల్ల ఒక ఉద్యోగి తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేసినప్పుడు, మొదటి నుంచి జమ అయిన మొత్తం కనిపించదు. ఈపీఎస్ వాటా విడిగా ఉంటుంది.
ఎవరికి పెన్షన్ వస్తుంది?
ఇంతకు ముందు ఈపీఎఫ్ఓ పెన్షన్ ప్రయోజనాలు అందరు ఉద్యోగులకు వర్తించేవి. కానీ ఇప్పుడు దీన్ని నెలవారీ జీతం తీసుకొనే ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేశారు. ప్రతి నెలా రూ.15,000 లేదా అంతకంటే తక్కువ జీతం అందుకునే వారు మాత్రమే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్‌కు అర్హులు. EPFO పెన్షన్ ప్రయోజనాలపై వీరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమందికి పెన్షన్ గురించి తెలిసినా, దాన్ని ఎప్పుడు, ఎంత మొత్తంలో ఇస్తారనే విషయాలు తెలియక తికమకపడుతుంటారు. పీఎఫ్ చందాదారుడికి 58 ఏళ్లు నిండిన తరువాత మాత్రమే పెన్షన్ వస్తుంది. వీరు కనీసం రూ.1,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ సేవలు, అర్హతకు సంబంధించిన సమాచారాన్ని, వివిధ యాప్‌లలో సైతం పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.