ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చిక్కుల్లో పడింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ యాక్ట్‌తో పాటు భారత నిబంధనలను ఉల్లంఘిచిందందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం. మల్టీ బ్రాండ్ బిజినెస్‌లో అవకతవకలకు పాల్పడిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇటీవలే వాణిజ్య శాఖ నుంచి ఈడీకి సమాచారం అందింది. ఈ క్రమంలోనే అమెజాన్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. ఫారన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) చట్టంలోని పలు సెక్షన్‌ల కింద దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొంది.
అంతేకాదు భారత్‌లోని ఒక అన్ లిస్టెడ్ కంపెనీతో చట్ట విరుద్ధంగా ఒప్పందాలు చేసుకొని ఫ్యూచర్ రిటైల్‌ను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా వెల్లడించింది. ఇది ఫెమాతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) నిబంధనలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. మరోవైపు అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) వాణిజ్యశాఖ పరిధిలో పనిచేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT)కి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ సమాచారాన్ని ఈడీకి చేరవేసింది డీపీఐఐటీ. ఈ క్రమంలోనే అమెజాన్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.
కాగా, ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ మధ్య జరిగిన వ్యాపార ఒఫ్పందాన్ని అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నించింది. ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిశోర్ బయానీ సహా వ్యవస్థాపకులను అరెస్ట్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ కేసులో అమెజాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ మధ్య ప్రతిపాదిత బిజినెస్ డీల్ ఆమోదించే తీర్మానం భారత చట్టాలకు అనుగుణంగా ఉందని, దీనిలో జోక్యం చేసుకోలేమని అమెజాన్ వాదనను ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
భారతలో రూల్స్ బ్రేక్ చేసేందుకు అమెజాన్ అమలు చేసిన సీక్రెట్ స్ట్రాటజీని రాయిటర్స్ వార్తా సంస్థ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. అమెజాన్‌లో విక్రయించే మొత్తం వస్తువుల విలువలో మూడింట ఒక వంతు కేవలం 33 మంది మంది అమెజాన్ అమ్మకందారులే ఉన్నారు. అంతేకాదు అమెజాన్ సంస్థ పరోక్షంగా పెట్టుబడులు కలిగిన ఉన్న మరో రెండు పెద్ద వ్యాపార సంస్థలు.. 2019వ సంవత్సరంలో అమెజాన్ ప్లాట్ ఫాం మీద జరిపిన విక్రయాల్లో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంటే, మొదట 33 మంది మూడింట ఒక వంతు, ఈ రెండు పెద్ద వ్యాపార సంస్థలు మరో 35 శాతం వాటా అంటే మొత్తంగా మూడింట రెండు వంతులు కలిగిఉన్నాయన్నమాట. 4 లక్షల మంది వ్యాపారులు చేసేది మూడింట ఒక వంతు అయితే, ఈ 35 మంది చేసేది మూడింట రెండు వంతులు. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా సీక్రెట్‌గా దాచింది అమెజాన్. 4 లక్షల మందికి వ్యాపార అవకాశాలు కల్పించినట్లు పైకి ప్రచారం చేసింది.
అమెజాన్ సంస్థకు భారత్.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. బయటకు లక్షలాది మంది వర్తకులకు ప్లాట్ ఫాం అందిస్తున్నట్టు చెబుతున్న అమెజాన్, వాస్తవంలో పెద్ద కంపెనీలకే ఎక్కువ వ్యాపారన్ని అందిస్తోంది. అమెజాన్ సంస్థ బడాబాబులకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తోందని కొందరు చిన్న వర్తకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ వాదనను అమెజాన్ ఖండించింది. భారత చట్టాలను తాము గౌరవిస్తున్నామని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.