ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నెలవారీ వేతన పరిమితిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోందా..? అంటే అవుననే అంటున్నాయి నివేదికలు. ఉద్యోగుల నెలవారి వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తున్నది. దీనిపై కొద్దికాలంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ.. ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల మధ్య త్వరలోనే చర్చలు జరగనున్నట్టు తెలుస్తున్నది.
EPF నెలవారీ పరిమితిని పెంచడానికి కార్మిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ రంగ ప్రతినిధుల మధ్య వచ్చే బుధ, గురువారాల్లో చర్చలు జరగనున్నట్టు తెలుస్తున్నది. ఈ చర్చలు సఫలమైతే ఉద్యోగుల నెలవారీ వేతన పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచనున్నారు.
రూ. 15 వేల కంటే తక్కువగా ఉన్నవారికి ఈపీఎఫ్ కట్ చేయొద్దని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) గతంలోనే ప్రభుత్వాన్ని కోరింది. కనీస వేతనం రూ. 21 వేలు ఉన్నవారికే పీఎఫ్ డిడక్ట్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్ లో ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. అంతేగాక.. కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. ఉద్యోగులక ప్రతిపాదించిన 240 Earned Leaves ను 300 రోజులకు పెంచాలని బీఎంఎస్ డిమాండ్ చేసింది.
కాగా.. ఉద్యోగులకు భవిష్యనిధి (EPF) వేతన పరిమితి 2014 సెప్టెంబర్ నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నది. అంతకుముందు రూ. 6,500 వేతనం ఉన్నవారికి కూడా పీఎఫ్ కట్ అయ్యేది. దానిని రూ. 15 వేలకు పెంచారు. దానిని ఇప్పుడు మళ్లీ రూ. 21 వేలకు పెంచాలని కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Central govt employees, EPFO, Private Sector