e-Vehicles Insurance: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా?.. వాటికి ఇన్సూరెన్స్ ఎలా వర్తిస్తుందో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

. 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్య 25-35 శాతానికి చేరుకుంటుందని కొన్ని నివేదికలు తెలిపాయి. దీంతో చిన్న స్టార్టప్‌ల నుంచి ప్రముఖ కంపెనీలు సైతం ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునే పనుల్లో నిమగ్నమయ్యాయి.

  • Share this:
ఇంధన ధరలు మండుతున్న వేళ వాహన ప్రియుల దృష్టి ఎలక్ట్రిక్ వేకిల్స్‌పై పడింది. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం, ప్రభుత్వ రాయితీలు, ఇతర ప్రయోజనాల కారణంగా వీటికి ఆదరణ పెరుగుతోంది. 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్య 25-35 శాతానికి చేరుకుంటుందని కొన్ని నివేదికలు తెలిపాయి. దీంతో చిన్న స్టార్టప్‌ల నుంచి ప్రముఖ కంపెనీలు సైతం ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ రంగంలోకి ప్రవేశించిన ఓలా సంస్థ.. ఇటీవల ఈ-స్కూటర్ల బుకింగ్‌లను సైతం ప్రారంభించింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే బుకింగ్‌లు మొత్తం పూర్తవడం విశేషం. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వేకిల్స్‌కు ఇన్సూరెన్స్ అంశం తెరపైకి వస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు అమ్మకాలు పెరుగుతున్నందువల్ల, వాటికి బీమా చేయడం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎలక్ట్రిక్ వేకిల్స్ కోసం పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాహనాల బ్యాటరీతో సహా సమగ్ర కవరేజీని అందించే ప్లాన్లు, యాడ్-ఆన్ ప్లాన్లు సైతం ఉన్నాయి. కొత్తగా ఈ-వేకిల్స్‌ తీసుకునేవారు, వాటికి ఇన్సూరెన్స్ సైతం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి?
సాధారణ నాన్- ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు అందించే థర్డ్ పార్టీ లేదా సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీలనే విద్యుత్ బైక్స్ లేదా స్కూటర్ల కోసం ఎంచుకోవచ్చు. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం.. థర్డ్ పార్టీ కవరేజ్ తీసుకోవడం తప్పనిసరి. ఇది థర్డ్ పార్టీ వ్యక్తుల ఆర్థిక భరోసాకు హామీ ఇస్తుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు.. లేదా బీమా చేసిన వేకిల్ వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులకు శారీరక గాయాలు అయినప్పుడు.. లేదా ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ థర్డ్ పార్టీ ఆస్తి నష్టానికి కారణమైనప్పుడు.. ఈ కవరేజీ వర్తిస్తుంది.

* మొత్తం కవరేజీ ఎంత ఉంటుంది?
కొత్త ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసినప్పుడు.. ఐదు సంవత్సరాల కాలానికి తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ పాలసీ.. ఎలక్ట్రిక్ వేకిల్స్ ద్వారా జరిగే ఆస్తి నష్టానికి రూ .7.5 లక్షల వరకు కవరేజీ అందిస్తుంది. మరణం, శారీరక గాయాలకు కవరేజీ అపరిమితంగా ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ బైక్‌లు/స్కూటర్ల కోసం ఒక సమగ్ర (కాంప్రహెన్సివ్) ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచిదని మోటార్ వేకిల్ ఇన్సూరెన్స్ నిపుణులు సూచిస్తున్నారు. వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా విద్యుత్ వాహనాలకు కలిగే నష్టాలను ఈ పాలసీలు భర్తీ చేస్తాయి. అగ్ని ప్రమాదాలు, పేలుడు, అల్లర్లు, హానికరమైన చర్యలు, వాహనం దొంగతనం వంటి మానవ నిర్మిత విపత్తుల వల్ల కలిగే నష్టాలకు సైతం కవరేజీ వర్తిస్తుంది.

* యాడ్- ఆన్ సదుపాయం సైతం..
సమగ్ర పాలసీలను ఎంచుకునే వారికి అవసరమైన యాడ్- ఆన్ ఇన్సూరెన్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇవి వినియోగదారుల ద్విచక్ర వాహనానికి అన్ని విధాలుగా రక్షణ, నష్టాలకు భరోసా కల్పిస్తాయి. వాహనాలను వినియోగిస్తున్న కొద్దీ ఎదురయ్యే అరుగుదల నష్టాలను భర్తీ చేసే జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ క్లెయిమ్... బ్రేక్ డౌన్ అయినప్పుడు నష్టాలను నివారించే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) యాడ్-ఆన్.. దొంగతనం లేదా ఏదైనా ప్రమాదంలో వాహనం పూర్తిగా పనికిరాకుండా మారినప్పుడు పూర్తి విలువను చెల్లించే రిటర్న్ టూ ఇన్వాయిస్ యాడ్-ఆన్.. వంటి వాటిని అవసరాల ప్రకారం కస్టమర్లు ఎంచుకోవాలి.
Published by:Sumanth Kanukula
First published: