పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అంతా సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అనంతరం సభలో సామాజిక, ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఆర్థిక సర్వేను విడుదల చేస్తారు. సాధారణంగా ఈ సర్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు విడుదలవుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రేపు పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో, ఈ రోజు ఆర్థిక సర్వేను విడుదల చేయనున్నారు.
ఆర్థిక సర్వే అనేది ప్రస్తుతం ముగింపు దశకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆర్థిక స్థితిని వెల్లడించే వివరణాత్మక నివేదిక. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో, ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ రిపోర్టును సిద్ధం చేస్తుంది. తర్వాత దీన్ని ఆర్థిక మంత్రి ఆమోదిస్తారు.
* ఆర్థిక సర్వే ప్రాధాన్యం
బడ్జెట్‌కు కేవలం ఒక రోజు ముందు వచ్చినప్పటికీ, ఎకనమిక్ సర్వేలో పొందుపరిచిన అంచనాలు, సిఫార్సులు బడ్జెట్‌కు కట్టుబడి ఉండవు. ఈ సర్వే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అధికారిక, సమగ్ర విశ్లేషణగా ఉంటుంది. ఈ రిపోర్టులోని పరిశీలనలు, వివరాలు భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషించడానికి అధికారిక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తాయి.
* ఫస్ట్ ఎకనమిక్ సర్వే
మన దేశంలో మొదటి ఆర్థిక సర్వేను 1950-51లో సమర్పించారు. 1964 వరకు బడ్జెట్‌తో పాటు ఈ రిపోర్టును సమర్పించేవారు. ఈ సర్వేను చాలా సంవత్సరాల వరకు కేవలం ఒక వాల్యూమ్‌గా సిద్ధం చేశారు. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవలు, వ్యవసాయం, తయారీ రంగాలతో పాటు ఆర్థిక పరిణామాలు, ఉపాధి, ద్రవ్యోల్బణం వంటి ఫిస్కల్ పాలసీల స్థితిగతులు దీంట్లో ఉండేవి. ఈ వాల్యూమ్‌లో అన్ని రకాల గణాంకాలను వివరంగా పేర్కొనేవారు.
* రెండు వాల్యూమ్స్‌కు మార్పు
2010-11 నుంచి 2020-21 మధ్య ఆర్థిక సర్వేను రెండు వాల్యూమ్‌లలో సిద్ధం చేశారు. సెకండ్ వాల్యూమ్‌పై చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ముద్ర ఉండేది. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు, చర్చలను దీంట్లో పేర్కొనేవారు. అయితే గత సంవత్సరం ఆర్థిక సర్వేను తిరిగి ఒకే వాల్యూమ్ సిస్టమ్‌కు మార్చారు. దీనికి ఒక కారణం ఉంది. గత సర్వే రిలీజ్ చేసిన సమయంలో CEAగా V.అనంత నాగేశ్వరన్ కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాత సలహారు ముద్ర ఉండే సెకండ్ వాల్యూమ్‌ను ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం ఆయనే ఆ బాధ్యతల్లో ఉన్నారు.
* ఈ సంవత్సరం ఆర్థిక సర్వేలో ఏమేం ఉండవచ్చు?
2017-18 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడానికి కష్టపడుతోంది. కోవిడ్ తర్వాతి సంవత్సరాల్లో వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది కానీ అది కేవలం గణాంకాలకే పరిమితమైంది. భారతదేశ వృద్ధిరేటు 8% నుంచి 6%కి పడిపోయిందని చాలా మంది బయటి ఆర్థికవేత్తలు వాదించారు. వృద్ధిలో క్షీణతతో పాటు కోవిడ్ తర్వాత నిరుద్యోగం, పేదరికం, అసమానతలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ రికవరీ నిజమైన పరిధిని, భారతదేశ వృద్ధి సామర్థ్యం ఒడిదొడుకులను ప్రస్తుత ఆర్థిక సర్వే నిర్ధారిస్తుంది. అలాగే భవిష్యత్తు పరిస్థితులు, అంచనాలను కూడా సర్వే సూచిస్తుంది. ముఖ్యంగా ఈ సర్వేలో CEA నాగేశ్వరన్ ముద్ర స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కీలక సమస్యలు, సవాళ్లను, పరిష్కారాలను ఈ రిపోర్టు పేర్కొంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Nirmala sitharaman, Parliament, Personal Finance