పండుగ సెలవుల్లో బస్సులు, విమానాల టికెట్లు పెరగడం సహజమే. అయితే ఈసారి దీపావళి (Diwali) పండుగ నేపథ్యంలో విమాన ఛార్జీలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. దీపావళి సెలవుల సందర్భంగా చాలామంది ప్రయాణాలకు సిద్ధమవుతుండగా.. దేశీయ విమాన టికెట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ డిమాండ్‌కు తగ్గట్టు డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ ధరలు (Domestic flight Prices) దాదాపు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా కొన్ని మెట్రో మార్గాల్లో విమాన టికెట్లు దాదాపు రెండింతలు పెరిగాయి. అయినా ప్రయాణికులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా టికెట్లు బుక్ చేస్తున్నారు. దాంతో చాలా తక్కువ సీట్లు మాత్రమే ఇప్పుడు బుకింగ్‌కు అందుబాటులో ఉంటున్నాయి.
ఆ రూట్స్‌లో పెరిగిన టికెట్ ధరలు
ముంబై, ఢిల్లీ మధ్య ఒక నాన్‌స్టాప్ రౌండ్ ట్రిప్ టికెట్ ధర సాధారణంగా రూ.12,000 ఉంటుంది. అయితే బుధవారం నాటికి అక్టోబర్ 24వ తేదీ కోసం బుక్ చేసుకునే టికెట్ ఛార్జీలు రూ.23,000కి చేరుకున్నాయి. అక్టోబరు 21న (శుక్రవారం) ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లడానికి వన్-వే టిక్కెట్ ధర రూ.12,000 - రూ.29,000గా ఉంది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వన్-వే టికెట్ ధరలు రూ.8,000 - రూ.25,500గా కంపెనీలు నిర్ణయించాయి. అక్టోబరు 22న ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు రూట్లలో రూ.12,000 - రూ.19,500.. రూ.7000 - రూ.22,000గా విమాన టికెట్ల ధరలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఈ దీపావళికి విమానంలో ప్రయాణాలు చేసే వారిపై అధిక భారం పడుతుందని తెలుస్తోంది.
పెరిగిన రద్దీ
పండుగ రద్దీ కారణంగా ఢిల్లీ, ముంబై మధ్య నడిచే విమానాల ఛార్జీలు 20-25% పెరిగాయని ట్రావెల్ పోర్టల్ అధికారులు చెబుతున్నారు. ముంబై-ఢిల్లీ తర్వాత ఢిల్లీ-పాట్నా, ముంబై-పాట్నా మధ్య విమానాలు ఈ బుధవారం అత్యంత ఖరీదైనవిగా మారాయి. అక్టోబరు 30న జరుపుకోనున్న ఛత్ పూజ కారణంగానే పాట్నాకు ఈ రద్దీ ఏర్పడిందని ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు. అక్టోబర్ 21, 31 మధ్య ఢిల్లీ నుంచి పాట్నాకు ఒక రౌండ్ ట్రిప్ టికెట్ గురువారం నాడు రూ.25,000కి చేరుకుంది. ఢిల్లీ, అలహాబాద్.. ముంబై, బెంగళూరు మధ్య విమానాలకు కూడా డిమాండ్ పెరిగింది. జైపూర్ వంటి డెస్టినేషన్లకు బుకింగ్‌లు కూడా పెరిగాయి. పండగ వేళ అన్ని విమానాల లోని సీట్లు ఎప్పటికప్పుడు కంప్లీట్ గా బుక్ అవుతున్నాయని ఎయిర్‌లైన్ సంస్థలు వెల్లడించాయి.
గోవా ఫ్లైట్ ఛార్జీలు కూడా
ఢిల్లీ నుంచి గోవాకు శనివారం జర్నీకి నాన్‌స్టాప్ ఫ్లైట్ ధరలు రూ.8,200 నుంచి రూ.27,000 వరకు చేరుకున్నాయి. అదే రోజు ముంబై నుంచి గోవాకు టిక్కెట్ ధర రూ.5,000 నుంచి రూ.21,000కి పెరిగింది. కోవిడ్ -19 ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడం, కరోనా కేసులు దాదాకు తగ్గిపోవడం, కేంద్ర ప్రభుత్వం టికెట్ ధరలపై పరిమితి తీసేయడం వంటి కారణాల వల్ల ఈ స్థాయిలో టికెట్ ధరలు పెరిగాయని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali, Diwali 2022, Flight Offers, Flight tickets, Price hikes