హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance for Mental Health: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మానసిక అనారోగ్యాలకు వర్తిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే...

Insurance for Mental Health: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మానసిక అనారోగ్యాలకు వర్తిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మానసిక అనారోగ్యాలకు అయ్యే చికిత్స ఖర్చులను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు భర్తీ చేస్తాయా లేదా అనే విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం

కరోనా తరువాత హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒత్తిడిలో కూరుకుపోయాయి. గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో క్లెయింలు చెల్లించాల్సి రావడంతో సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఫలితంగా కొత్త పాలసీల ప్రీమియం ధరలు సైతం పెరిగాయి. అయితే కరోనా మహమ్మారి బాధితుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సైతం తీవ్రంగా దెబ్బతీస్తోందని అధ్యయనాలు తేల్చాయి. కోవిడ్-19 వ్యాప్తి తరువాత యాంటీ డిప్రెసెంట్స్ మందుల అమ్మకాలు 23 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. 2019 ఏప్రిల్‌లో ఈ మందుల అమ్మకాల విలువ రూ.189 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ఇది దాదాపు రూ.218 కోట్లకు పెరిగిందని ఆల్ ఇండియన్ ఆరిజిన్ కెమిస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ (AIOCD) వెల్లడించిన పరిశోధన పత్రం పేర్కొంది.

మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో-సైన్సెస్ అందుబాటులోకి తీసుకొచ్చిన హెల్ప్ లైన్ నంబర్‌కు వచ్చే ఫోన్ కాల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మానసిక అనారోగ్యాలకు అయ్యే చికిత్స ఖర్చులను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు భర్తీ చేస్తాయా లేదా అనే విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* అనారోగ్యాల తీవ్రత ఎలా ఉంది?

దేశంలో దాదాపు 197.3 మిలియన్ల మంది వివిధ రకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్నారని ICMR-PHFI- 2019 నివేదిక వెల్లడించింది. నిజానికి 2018లోనే మానసిక అనారోగ్యాలకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపుపై మార్గదర్శకాలు విడుదల చేయాలని IRDAI.. బీమా సంస్థలను ఆదేశించింది. అనంతరం 2019 సెప్టెంబర్ 27న ఐఆర్‌డీఏఐ ఒక సర్క్యులర్‌ విడుదల చేసింది. మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఇతర మానసిక రుగ్మతలు, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ వంటి చికిత్సలకు పాలసీ వర్తింపజేయాలని అందులో పేర్కొంది. మానసిక అనారోగ్యాలకు కవరేజీపై ఇటీవల వార్తల్లో నిలిచిన శిఖా నిశ్చల్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ- NIC (ఏప్రిల్ 2021) కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

చికిత్స విషయంలో మానసిక అనారోగ్యాలను, శారీరక అనారోగ్యాల నుంచి వేరుచేసి చూడలేమని కోర్టు పేర్కొంది. అందువల్ల బీమా వర్తింపు విషయంలో కూడా ఈ రెండు రకాల అనారోగ్యాలకు తేడాలు ఉండకూడదని తేల్చి చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడం, సామాజిక ఒంటరితనం, వైరస్ భయాలు.. వంటివి మానసిక సమస్యలకు దారితీశాయని కోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక అనారోగ్యాల చికిత్సకు అయ్యే ఖర్చులను సైతం బీమా పాలసీలు కవర్ చేయాలని ఎన్‌ఐసీని ఆదేశించింది.

* చట్టం ఏం చెబుతోంది?

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం- 2017లోని సెక్షన్ 21(4) ప్రకారం.. అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మానసిక అనారోగ్య చికిత్సలకు.. శారీరక చికిత్సల మాదిరిగానే మెడికల్ ఇన్సూరెన్స్ అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సుమారు 234 కంటే ఎక్కువ మానసిక అనారోగ్యాలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు IRDAI ఆమోదించింది. కానీ ఈ నిబంధనలను కంపెనీలు పట్టించుకోవట్లేదు. అయితే కొన్ని సంస్థలు మాత్రం మానసిక అనారోగ్యాలకు బీమా చేసిన మొత్తంలో 25 శాతాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తున్నాయి. దీనికి వెయిటింగ్ పీరియడ్ 48 నెలలుగా ఉంది.

అయితే చాలామంది వినియోగదారులకు ఇలాంటి పాలసీ ప్రయోజనాల గురించి అవగాహన ఉండట్లేదంటున్నారు ఇన్సూరెన్స్ అడ్వైజర్లు. మానసిక అనారోగ్యాల విషయంలో క్లెయిం రేటు సున్నాగానే ఉందని చాలామంది చెబుతున్నారు. స్కిజోఫ్రెనియా, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక అనారోగ్యాల చికిత్సకు ఇన్సూరెన్స్ కవరేజీని చట్టం తప్పనిసరి చేసింది. అందువల్ల హెల్త్ పాలసీ తీసుకునే ముందు వినియోగదారులు దీనికి సంబంధించిన నియమ, నిబంధనలను పరిశీలించాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.

First published:

Tags: Health Insurance

ఉత్తమ కథలు