కరోనాతో దాదాపు ఏడాది పాటు స్థంభించిపోయిన ప్రయాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ప్రయాణాలపై నిషేధాలు, విమానాల రాకపోకలు రద్దు, లాక్డౌన్లతో ట్రావెల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. అయితే, ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో అన్ని ప్రయాణాలు పునరుద్ధరించబడ్డాయి. కానీ, కరోనా పూర్తి స్థాయిలో అంతం కాకపోవడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రయాణ బీమా అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ అసలు ప్రయాణ బీమా అంటే ఏమిటి? ఎందుకు అవసరం? దాని వల్ల లాభాలేమిటి? వంటి వివరాలను తెలుసుకుందాం.
ప్రయాణ బీమా అవసరమా?
ప్రపంచవ్యాప్తంగా COVID-19 భారీన పడిన వారు ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్ల, మీ ఆసుపత్రి ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయాణ బీమా పథకాన్ని ఎంచుకోవాలని పరిశ్రమ నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రయాణ బీమాపై భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ అండర్ రైటింగ్ అండ్ రీ ఇన్స్యూరెన్స్ ఆఫీసర్ మిలింద్ వి కొల్హే మాట్లాడుతూ, ‘‘దేశ విదేశీ ప్రయాణికులకు ఒత్తిడి లేని ప్రయాణాన్ని అందించేందుకు ప్రయాణ బీమా రూపొందించబడింది. ఇది కేవలం మెడికల్ ఎమర్జెన్సీ పరంగానే కాకుండా ప్రయాణికుడి లగేజీని ఎవరైనా దొంగిలించినా సరే ఈ ఇన్సూరెన్స్ కింద కవరేజీ లభిస్తుంది.” అని అన్నారు.
ప్రయాణ బీమా బెనిఫిట్స్ ఏంటి?
అత్యవసర ఖర్చులు
ఇరత దేశాలకు ప్రయాణం చేసే వారు సాధారణంగా ముందుగానే తమ అన్ని కార్యకలాపాలను ప్లాన్ చేసుకుంటారు. డబ్బు ఆదా చేయడానికి ముందుగానే ఎక్కువ బుకింగ్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో, అనుకోని విపత్తు ఏదైనా ఎదురైతే వారికి ప్రయాణ బీమా అండగా ఉంటుంది. అనగా పాలసీదారుడు ట్రిప్లో ఉన్నప్పుడు అనారోగ్యం బారినపడ్డా, ప్రమాదంలో చనిపోయినా, గాయాలపాలైనా సరే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ వారి పట్ల జాగ్రత్త తీసుకుంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ యాత్రికుడు ఎంచుకున్న పాలసీ రకాన్ని బట్టి ఆసుపత్రి ఛార్జీలు, అంబులెన్స్ సేవలు, వైద్యు ఖర్చులకు కవరేజీని అందిస్తుంది.
ఆసుపత్రి ఖర్చులు
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ప్రయాణికుడుకు అనారోగ్యం పాలైనా, గాయాలపాలైనా వారి వైద్య ఖర్చులకు కవరేజీ లభిస్తుంది. ఒకవేళ, ప్రయాణికుడు ట్రిప్లో ఉన్నప్పుడు మరణిస్తే వారి, మృతదేహాలను స్వదేశానికి స్వదేశానికి పంపించడానికి అయ్యే ఖర్చు కూడా ప్రయాణ బీమా ద్వారా భర్తీ చేయబడుతుంది.
డైలీ అలవెన్స్
పాలసీదారుడు ట్రిప్లో ఉన్నప్పుడు ఏదైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరితే వారికి డైలీ అలవెన్స్ కూడా లభిస్తుంది. పాలసీదారుడు ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి డిస్ఛార్జ్ అయ్యే రోజు వరకు ప్రతి రోజు మెడికల్ అలవెన్స్ కింద వారికి కొంత నగదు ఇవ్వబడుతుంది.
అత్యవసర వసతులు
ప్రయాణ సమయంలో అగ్ని ప్రమాదం, వరదలు, పేలుడు, భూకంపం, తుఫాను వంటి విపత్కర సమయాల్లో ప్రయాణికులు వారి వసతిని వేరో చోటుకు మార్చుకుంటారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుంది. అత్యవసర వసతికి అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీలే భరిస్తాయి.
వ్యక్తిగత ప్రమాదం
ప్రయాణ సమయంలో పాలసీదారుడు గాయాలపాలైతే వారికి మెడికల్ కవరేజ్ లభిస్తుంది. వారి ఆసుపత్రి ఖర్చులకు పరిహారం లభిస్తుంది. శాశ్వత, పాక్షిక వైకల్యం మాత్రమే కాకుండా ప్రమాదంలో మరణించిన సందర్భంలోనూ వారికి కవరేజీ లభిస్తుంది. అంతేకాక, మీరు ట్రిప్లో ఉండగా ఆసుపత్రి పాలైతే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి హోటల్ గికి అయ్యే ఖర్చులు, విమాన ప్రయాణ ఖర్చులు రీయింబర్స్ అవుతాయి.
యాత్ర రద్దు
ముఖ్యంగా మహమ్మారి తరువాత విమానాలను రద్దు చేయడం సర్వసాధారణమైంది. దీంతో చివరి నిమిషంలో ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.