Inoperative PPF account: మీ పీపీఎఫ్ అకౌంట్ పనిచేయడం లేదా..? అయితే ఈ సింపుల్ స్టెప్స్ తో మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండిలా..!

ప్రతీకాత్మక చిత్రం

పీపీఎఫ్ అకౌంట్‌ యాక్టివేషన్‌లో ఉండేందుకు ప్రతి ఖాతాదారుడు అకౌంట్‌లో కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నియమాన్ని పాటించకపోతే అకౌంట్ పనిచేయదు. చాలా మంది ఈ నియమం గురించి తెలియక..

  • Share this:
నష్టభయం లేని పెట్టుబడుల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పీపీఎఫ్ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంటుంది. పీపీఎఫ్‌ పెట్టుబడుల వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతం వరకు ఉంది. వీటిపై రాబడికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. నిర్ణీత వడ్డీ హామీ కూడా ఉండటంతో, ఇది చిన్న పొదుపు పథకాల్లో ప్రధాన పెట్టుబడి మార్గంగా మారింది. ఈ డిపాజిట్లకు 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాదారుడు కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి అకౌంట్ తీసుకున్న ఐదేళ్ల తరువాత కూడా డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ పీపీఎఫ్ ఖాతాదారుడు అప్పటికి పనిచేస్తున్న ఖాతాలో (active PPF account) మాత్రమే డబ్బును ఉపసంహరించుకోవచ్చు లేదా జమ చేయవచ్చు. ఈ అకౌంట్‌ను యాక్టివ్ మోడ్‌లో ఉంచడానికి కనీస నియమాలను పాటించాలి. ఒకవేళ పీపీఎఫ్ అకౌంట్ పనిచేయకపోతే, సంబంధిత నిబంధనల ప్రకారం అకౌంట్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

పీపీఎఫ్ అకౌంట్‌ యాక్టివేషన్‌లో ఉండేందుకు ప్రతి ఖాతాదారుడు అకౌంట్‌లో కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నియమాన్ని పాటించకపోతే అకౌంట్ పనిచేయదు. అందువల్ల ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి.. అంటే మార్చి 31 నాటికి పీపీఎఫ్ అకౌంట్‌లో కనీసం రూ.500 డిపాజిట్ చేశారో లేదో తనిఖీ చేసుకోవాలి.

పనిచేయని పీపీఎఫ్‌ అకౌంట్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
ఇన్ యాక్టివ్‌గా మారిన పీపీఎఫ్ అకౌంట్‌ను ఖాతాదారులు పనిచేసేలా చేయవచ్చు. ఇప్పటికే పనిచేయకుండా పోయిన అకౌంట్‌లో ఎన్ని సంవత్సరాల నుంచి రూ.500 కనీస డిపాజిట్ చేయట్లేదో గుర్తించాలి. ఈ మొత్తాన్ని సంబంధిత అకౌంట్‌లో డిపాజిట్ చేయాలి. డబ్బు డిపాజిట్ చేయని ప్రతి సంవత్సరానికి రూ.50 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీపీఎఫ్‌ ఖాతాదారుడు తన అకౌంట్లో రెండేళ్ల నుంచి డబ్బు డిపాజిట్ చేయట్లేదు అనుకుందాం. సాధారణంగా కనీస డిపాజిట్ మొత్తం రూ.500 ఉంటుంది. రెండేళ్లకు ఇది రూ.1,000కి చేరుకుంటుంది. ఈ రెండు సంవత్సరాలకు ఏటా రూ.50 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూ.100 కలిపి మొత్తం రూ.1,100 డిపాజిట్ చేస్తే.. పీపీఎఫ్‌ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.

మెచూరిటీ తీరిన తరువాత?
పీపీఎఫ్‌ అకౌంట్‌కు 15 సంవత్సరాల మెచూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆ తరువాత అందే మొత్తాన్ని ఖాతాదారుడు తీసుకోవచ్చు. ఈ డబ్బు విత్‌డ్రా చేయకుండా, అకౌంట్‌లో పెట్టుబడులను ఐదేళ్ల బ్లాక్ పీరియడ్‌ వరకు పొడిగించుకోవచ్చు. అందువల్ల మెచూరిటీ తీరిన తరువాత ఖాతాదారులు పీపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటారా లేదా మరో ఐదేళ్ల వరకు పెట్టుబడులను కొనసాగిస్తారా అనే విషయాన్ని ధ్రువీకరించాలి. ఈ వివరాలను సంబంధిత బ్యాంకులు లేదా పోస్టాఫీసులకు తెలపాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఖాతాదారులు ధ్రువీకరించకపోతే.. మెచూరిటీ తీరిన పీపీఎఫ్ అకౌంట్‌ కాంట్రిబూషన్ లేకుండా గడువు పొడిగించే జాబితాలో పడిపోతుంది. ఈ సందర్భంలో కూడా పీపీఎఫ్ అకౌంట్ యాక్టివేషన్‌లో ఉంటుంది. కానీ ఖాతాదారుడు ఆ అకౌంట్‌లో డిపాజిట్ చేసే అవకాశం ఉండదు.
Published by:Hasaan Kandula
First published: