ఆసుపత్రి బిల్లులపై క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ను (Claim Settlement) చాలా హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) సంస్థలు పాలసీదారులకు అందిస్తున్నాయి. క్యాష్‌లెస్ అంటే సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అయితే క్లెయిమ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి క్యాష్‌లెస్ గా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సొంత డబ్బు ఖర్చు కాకుండా అన్నీ ఇన్సూరెన్స్ కింద వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా సెటిల్మెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
నెట్‌వర్క్‌లో ఉన్న ఆసుపత్రికే
ప్రతీ ఇన్సూరెన్స్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులనే తమ నెట్‌వర్క్‌లో ఉంచుతుంది. అయితే బీమాదారులు.. ఇన్సూరెన్స్ సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ లో ఏ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఆ నెట్‌వర్క్‌లోని ఆసుపత్రికి వెళితేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ నెట్‌వర్క్‌లో ఉన్న ఇంటికి దగ్గరగా ఉండే ఆసుపత్రిని ఎంపిక చేసుకోవాలి. క్యాష్‌లెస్ సెటిల్మెంట్ అంటే చేతిలో నుంచి ఎలాంటి డబ్బు ఇవ్వాల్సి ఉండదు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా అత్యంత తక్కువ మొత్తం ఉంటుంది.
ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలనేది ముందుగానే ప్రణాళిక చేసుకుంటే ట్రీట్మెంట్ వివరాలను ఇన్సూరెన్స్ సంస్థకు లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్(టీపీఏ) కు సమాచారం ఇవ్వాలి. అడ్మిట్ అయ్యే వారం ముందు తెలియజేయాలి. డాక్టర్ రికమెండేషన్లు, సంబంధిత మెడికల్ పత్రాలను మెయిల్ ద్వారా టీపీఏకు పంపాలి. క్యాష్‌లెస్ సెటిల్మెంట్ కు సంబంధించిన కన్సంట్ లెటర్‌ను పొందాలి. అడ్మిట్ అయ్యే సమయంలో ఈ లెటర్‌ను తప్పకుండా ఆసుపత్రిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే.. ఆసుపత్రిలో చేరిన 24 గంటల వ్యవధిలో టీపీఏకు సమాచారం ఇవ్వాల్సిందే.
ఆసుపత్రిలో రూమ్ రెంట్ విషయంలో చాలా ఇన్సూరెన్స్ సంస్థలు పరిమితి విధిస్తాయి. ఉదాహరణకు రోజుకు రూ.5వేలు ఇలా గరిష్ఠ పరిమితిని విధిస్తాయి. ఒకవేళ ఇన్సూరెన్స్‌లో ఉన్న లిమిట్ కంటే ఎక్కువ అద్దె చార్జీలు వేసే ఆసుపత్రిలో చేరితే.. అదనపు మొత్తాన్ని మీరే చెల్లించాల్సి రావొచ్చు. ఒకవేళ రెంట్ పై ఎలాంటి పరిమితి లేని ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే ఎలాంటి చింత అవసరం లేదు.
మినహాయింపులను ఆర్థం చేసుకోవాలి
చికిత్స సమయంలో వినియోగించే డిస్పోజల్స్ తో పాటు కొన్ని రిజిస్ట్రేషన్లు, సర్వీస్ చార్జీలను ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లించకపోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీల్లోని నిబంధనల్లో ఈ ఎక్స్‌క్లూజన్స్ (మినహాయింపు)లను జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే బిల్లులో కొంత మొత్తాన్ని బీమాదారుడే కట్టేలా కో-పే క్లాజ్ కూడా ఉందేమో చూడాలి. ఇలా అన్నీ పరిశీలించి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే సిద్ధంగా ఉండాలి.
బీమా సంస్థ ఇచ్చిన ఇన్సూరెన్స్ కార్డుతో పాటు పాలసీ డాక్యుమెంట్లను తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి. అలాగే పాన్ కార్డు, ఆధార్ లాంటి వ్యక్తిగత, అడ్రస్ ప్రూఫ్ లను ఉంచుకోవాలి. మెడికల్ డాక్యుమెంట్లు, వైద్య పరీక్షల రిపోర్టులు ఆసుపత్రిలో చేరే సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా ఇన్సూరెన్స్ మెడికల్ కార్డును తీసుకెళ్లడం చేయాలి. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా.. ఆసుపత్రిలో చేరేందుకు ఇబ్బంది రాదు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.