మన దేశంలో బంగారంతో చేసిన ఆభరణాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారత్‌కు పేరుంది. ఆభరణాల కోసమే కాకుండా, పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ పెట్టుబడులు డిజిటల్ పద్ధతిలోకి మారాయి. ఇప్పుడు డిజిటల్ గోల్డ్ పెట్టుబడులపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. కరోనా, లాక్డౌన్ వల్ల ప్రజలు ఆభరణాల కోసం జ్యువెలర్స్‌కు వెళ్లడం తగ్గించారు. దీంతో వినియోగదారులు ఆన్లైన్లోనే బంగారాన్ని కొనడంపై దృష్టి పెట్టారు. ఇది ఒక పెట్టుబడి మార్గంగా మారింది. డిజిటల్ గోల్డ్ కంపెనీ అయిన ఆగ్మోంట్ గోల్డ్ లిమిటెడ్ సంస్థ వ్యాపారం లాక్డౌన్ కాలంలో 40నుంచి 50 శాతం పెరగడం విశేషం. ఈ నేపథ్యంలో డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి, దాంట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పెట్టుబడి మార్గంగా బంగారంబంగారంలో పెట్టుబడులు పెట్టడమంటే, దాన్ని కొనుగోలు చేయడమని అర్థం. సాధారణంగా బంగారం కొనేవారు నాణేలు, బులియన్, ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తారు. ఇవి కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ETFలు వంటివి కూడా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. కరోనా మహమ్మారి వల్ల బంగారంలో పెట్టుబడులు ఆన్లైన్ విధానంలోకి మారిపోయాయి. దీంతో కొత్తగా డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు అందుబాటులోకి వచ్చాయి.
డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి?
పెట్టుబడుల్లో భాగంగా బంగారాన్ని నేరుగా కొనడం వల్ల కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దాని చట్టబద్ధత, స్వచ్ఛతను గుర్తించడంలో సమస్యలు ఉన్నాయి. దాన్ని దీర్ఘకాలం భద్రపరచడం పెద్ద సమస్య. దీనికి తోడు కరోనా వల్ల దుకాణాలకు వెళ్లి బంగారం కొనకపోవడమే మంచింది. డిజిటల్ బంగారాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. వినియోగదారుల తరపున దాన్ని అమ్మేవారు భీమా ఉన్న మార్గాల్లో జాగ్రత్తగా దాచిపెడతారు. బంగారాన్ని నేరుగా కొనడం వల్ల ఎదురయ్యే సమస్యలకు డిజిటల్ గోల్డ్ చెక్ పెడుతుంది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో ఎప్పుడైనా, ఎక్కడైనా డిజిటల్ విధానంలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
ఎవరు అమ్ముతారు?
Paytm, Google Pay, PhonePe వంటి మొబైల్ ఈ-వాలెట్ల ద్వారా సులభంగా డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజీ సంస్థలు కూడా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి సదుపాయాలను కల్పిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ గోల్డ్‌ను అందించే కంపెనీలు మూడు ఉన్నాయి. అవి..1. Augmont Gold Ltd.
2. MMTC-PAMP India Pvt.Ltd (ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే MMTC లిమిటెడ్, స్విస్ సంస్థ MKS PAMPల జాయింట్ వెంచర్.)
3. డిజిటల్ గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సేఫ్ గోల్డ్ బ్రాండ్)
Paytm, G-Pay వంటి యాప్‌లు, వెబ్సైట్లు సేఫ్గోల్డ్, MMTC, PAMP కంపెనీలకు ఒక వేదికలా మాత్రమే పనిచేస్తాయి. వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత, ఈ వాణిజ్య సంస్థలు అంతే విలువ ఉన్న ఫిజికల్ గోల్డ్‌ను కొనుగోలు చేసి వినియోగదారుల పేరుతో సురక్షితమైన మార్గాల్లో నిల్వ చేస్తాయి.
డిజిటల్ గోల్డ్‌ను ఎలా కొనుగోలు చేయాలి?
ముందు వినియోగదారులు పేటీఎం, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, గూగుల్ పే, మోతిలాల్ ఓస్వాల్ వంటి డిజిటల్ గోల్డ్ పెట్టుబడులను అందించే ప్లాట్‌ఫారాల్లో లాగిన్ కావాలి. ఆ తరువాత కొన్ని దశలను కస్టమర్లు పూర్తి చేయాలి. రూపాయల్లో లేదా గ్రాములలో మీరు బంగారాన్ని కొనాలనుకున్న మొత్తాన్ని నమోదు చేయాలి. స్థిర విలువ లేదా బరువు ప్రకారం, మార్కెట్ రేటుతో వినియోగదారులు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆ తరువాత డబ్బు చెల్లించే మార్గాన్ని ఎంచుకోవాలి.
KYC ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అకౌంట్ నుంచి, లేదా కార్డ్, వాలెట్ ద్వారా డబ్బు చెల్లించవచ్చు. ఆ తరువాత మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని సురక్షితమైన లాకర్లో నిల్వ చేసుకోవచ్చు. అనంతరం మీ అకౌంట్ అప్డేట్ అవుతుంది. ఎప్పుడైనా మీ అకౌంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ డిజిటల్ గోల్డ్‌ను అమ్ముకోవచ్చు. లేదా బంగారాన్ని నేరుగా స్వీకరించడానికి ఫిజికల్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. బంగారాన్ని అమ్మకూడదని నిర్ణయించుకుంటే.. నాణేలు, బులియన్ రూపంలో డోర్ డెలివరీ చేయమని కోరవచ్చు. ఇందుకు డెలివరీ ఫీజు విధించే అవకాశం ఉంది.
ఉపయోగాలు
ఆన్లైన్లో బంగారాన్ని కొన్న తరువాత, దాన్ని ఫిజికల్ డెలివరీ ఆప్షన్ ద్వారా తీసుకోవచ్చు. కనీసం రూ.1 కంటే తక్కువ మొత్తంలో కూడా ఈ విధానంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్లైన్ లోన్లకు డిజిటల్ గోల్డ్‌ను సెక్యూరిటీగా ఉపయోగించవచ్చు. డిజిటల్ గోల్డ్ 24క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం. MMTC, PAMP వంటి సంస్థలు డిజిటల్ గోల్డ్ స్వచ్ఛతను 999.9 శాతంగా నిర్ధారించాయి. దీన్ని సురక్షితంగా నిల్వ చేయవచ్చు. భద్రత విషయంలో భయం లేకుండా 100 శాతం బీమా చేసి నిల్వ చేస్తారు. అవసరమైతే డిజిటల్ గోల్డ్‌ను ఆభరణాలు, బులియన్, బంగారు నాణేలుగా మార్చుకోవచ్చు.
డిజిటల్ గోల్డ్‌తో నష్టాలు..
చాలా వరకు డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌లు రూ.2 లక్షలను కనీస పెట్టుబడి పరిమితిగా నిర్ణయించాయి. వీటిపై రిజర్వు బ్యాంక్, సెబీ వంటి అధికారిక ప్రభుత్వ నియంత్రణ సంస్థ లేకపోవడం పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. బంగారం ధరకు అదనంగా డెలివరీ, మేకింగ్ ఛార్జీలు కూడా విధించడం వల్ల చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కంపెనీలు పరిమిత కాలం వరకే బంగారాన్ని నిల్వ చేస్తామనే నిబంధనలు విధిస్తాయి. ఆ తర్వాత వినియోగదారులు కచ్చితంగా ఫిజికల్ డెలివరీ తీసుకోవాల్సిందే. లేదంటే డిజిటల్ గోల్డ్‌ను అమ్ముకోవాలి.
ఆ మార్గాలే మేలు..
కరోనా తరువాత బంగారం ధరలు చాలా వరకు పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీన బంగారం ధర రూ.39,100గా ఉంది. అక్టోబరు 28 నాటికి ఇది రూ.52,300కు చేరుకోవడం విశేషం. అంటే బంగారం కొన్నవారు 33 శాతం రిటర్న్స్ పొందారని అర్థం. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని బంగారానికి కేటాయించడం మంచిది. కానీ డిజిటల్ గోల్డ్‌తో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటిఎఫ్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే మంచి రాబడి లభిస్తుంది.
బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో భాగంగానే చూడాలి. గోల్డ్ బాండ్లతో అదనంగా 2.5 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. బంగారంలో స్వల్పకాలిక పెట్టుబడుల కోసం గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవచ్చు. ఇవి సెబీ అధికార పరిధిలోకి వస్తాయి. డిజిటల్ గోల్డ్‌తో పోలిస్తే ఇలాంటి వాటికి మెరుగైన భద్రత లభిస్తుంది. రూ.2 లక్షల పెట్టుబడి పరిమితి లేకుండా, రెగ్యులేటరీ బాడీని నియమించిన తరువాత డిజిటల్ గోల్డ్ పెట్టుబడులను మంచి ఎంపికగా పరిగణించవచ్చు.