ఈ మధ్య కాలంలో పూర్తి బుల్లిష్ వాతావరణం కనిపించడంతో చాలా మంది కొత్తవాళ్లు కూడా స్టాక్ మార్కెట్లో (Stock Market) ప్రవేశిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా ఐపీఓలు రావడం కూడా ప్లస్ అయింది. ఈ సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో $ 9.7 బిలియన్లను కంపెనీలు ఐపీఓల (IPO) ద్వారా సేకరించాయి. గడిచిన 2 దశాబ్దాల కాలంలో 9 నెలల వ్యవధిలో ఇంత మొత్తాన్ని సమీకరించడం ఇదే మొదటిసారి. అదే అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్ల నిధుల సమీకరణతో పోల్చితే ఇది కేవలం 3శాతమే. జనవరి- సెప్టెంబర్ కాలంలో భారతదేశంలో 72 ఐపీఓలు స్టాక్మార్కెట్లోకి వచ్చాయి. జొమాటో వంటి కంపెనీల ఐపీఓకు విపరీతమైన ఆదరణ లభించడంతో కొత్త తరం టెక్-కంపెనీలు లిస్టింగ్ కోసం ముందుకు వస్తాయి.
ఇటీవల్ స్టాక్ మార్కెట్లో లిస్టైన చాలా కంపెనీల ద్వారా పెట్టుబడిదారులు మంచి లాభాలు అందుకున్నారు. చాలా ఐపీఓలు ప్రీమియంతో లిస్ట్ కావడంతో చాలా మంది వేగంగా లాభాలు ఆర్జించేందుకు వాటిని అమ్ముకున్నారు. ఒక్క పేటీఎం మినహా దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన షేర్లన్నీ మంచి ప్రీమియంతో లిస్టయ్యాయి. ఈ నేపథ్యంలో ఇలా సంపాదించిన మొత్తంపై పన్ను ఎలా వర్తిస్తుందో చూద్దాం.
ఉదాహరణకు నైకా ఐపీఓ చాలా మందిని కోటీశ్వరులను చేసింది. నైకా షేర్లు రూ.2018కు లిస్టయ్యాయి. పెట్టుబడిదారుగా మీరు రూ.1125 ఒక షేర్ చొప్పున 100 షేర్లకు అప్లై చేసి ఉండి, అలాట్ అయి లిస్టింగ్ అయిన వెంటనే మీరు వాటిని అమ్మారను అనుకుందాం. అంటే దాని పై మీరు రూ.2,01,800 – రూ.1,11,500 = రూ.89,300 లాభం అందుకొని ఉంటారు. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఈ ఆదాయాన్ని కేపిటల్ గెయిన్ అంటారు. షేర్లకు సంబంధించి లిస్టింగ్‌లో లాభాలు/నష్టాలకు సంబంధించి ప్రత్యేకమైన పన్నుల విధానం లేదు. షేర్లకు కూడా కేపిటల్ గెయిన్స్ నిబంధనలు వర్తిస్తాయి.
ఐపీఓల లిస్టింగ్ ద్వారా పొందే లాభాలకు ప్రత్యేక పన్ను నిబంధనలు ఉన్నాయా?
ఐపీఓలో షేర్లు అలాట్ అయి వాటిని సదరు వ్యక్తి 12 నెలల లోపు అమ్మినట్టు అయితే ఆ కారణంగా తలెత్తే లాభం/నష్టాలను స్వల్పకాలిక కేపిటల్ గెయిన్/లాస్‌గా పరిగణించడం జరుగుతుంది. దీనిపై పన్ను 15% ఉంటుంది. అదే పెట్టుబడిదారు, ఆ షేర్లను ఒక సంవత్సరం తర్వాత విక్రయిస్తే.. వాటిని దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్ అంటారు. ఆ మొత్తం రూ.1 లక్ష కంటే ఎక్కువ ఉంటే దానిపై పన్ను 10% ఉంటుంది. అదే దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్ రూ.1 లక్ష లోపు ఉంటే దానిపై ఎటువంటి పన్ను ఉండదు.
ఐపీఓ లిస్టింగ్‌లతో వచ్చే లాభాలు/నష్టాలను పన్నుచెల్లింపుదారులు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, స్వల్పకాలిక కేపిటల్ నష్టాన్ని షార్ట్ టర్మ్/లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్‌లో సెట్ చేసుకునే వెసులుబాటు ఉంది. షార్ట్ టర్మ్ కేపిటల్ లాస్‌ను ఒకవేళ పన్నుచెల్లింపుదారు ఈ సంవత్సరం సెట్ ఆఫ్ చేసుకోలేక పోతే, దానిని 8 సంవత్సరాల వరకు క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వీలు ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.