కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కరోనాను నిర్మూలించడానికి టీకా ఒక్కటే మార్గమని భావిస్తున్నాయి. కానీ ప్రజలు మాత్రం టీకా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రభుత్వాలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. చివరికి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రజలు టీకా తీసుకుంటారని భావించాయి. ఇక అనుకున్నదే తడవుగా కొన్ని దేశాలు రకరకాల ప్రోత్సాహకాలు ప్రకటించడం ప్రారంభించాయి. టీకా వేయించుకున్న వారికి గేమింగ్ టికెట్లు, బీరు, పిజ్జా, బర్గర్ వంటి ఫుడ్ ఐటమ్స్ ఉచితంగా ఇస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఇక మరికొన్ని ప్రాంతాల్లో టీకా తీసుకున్న వారికి లాటరీ పద్ధతిలో డబ్బులు బహుమతిగా ఇస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలు మాత్రం ఎవరూ ఊహించని బహుమతులు ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
తాజాగా హాంకాంగ్ ప్రకటించిన బహుమతులను చూసి ప్రపంచం అవాక్కయ్యింది. కరోనా టీకా తీసుకుంటే చాలు.. రూ.లక్షల విలువైన బంగారు కడ్డీలు, విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఇంకా మరెన్నో విలువైనవి గెలుచుకోవచ్చని హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. ఒక టెస్లా కారుకి లేదా ఒక అపార్ట్‌మెంట్‌కు ఓనర్ కూడా కావచ్చు.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. హాంగ్‌కాంగ్‌లో వ్యాక్సిన్ తీసుకున్నవారు బంగారు కడ్డీలు, డైమండ్స్‌తో చేసిన రోలెక్స్ వాచీలు, షాపింగ్ వోచర్లను గెలుచుకోవచ్చట. లాటరీ విధానంలో విలువైన వస్తువులను తమ పౌరులకు బహుమతిగా ఇచ్చేందుకు హాంకాంగ్ సర్వం సిద్ధం చేస్తోంది. ప్రోత్సాహక పథకాలు ప్రకటించిన తర్వాత టీకా తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఇక రష్యా దేశం శీతల ప్రదేశాలలో నివసించే తమ పౌరుల కోసం స్నోమొబైల్స్ అనే వాహనాలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాల్లో విజృంభించిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వాలు బాగా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం, ప్రోత్సాహకాలు ప్రకటించడమే మంచి నిర్ణయమని భావిస్తున్నాయి. మరోపక్క వ్యాక్సిన్ తీసుకునే ప్రజల సంఖ్య పెరిగింది. అయితే, కేవలం బహుమతుల కోసమే రెట్టింపు సంఖ్యలో ప్రజలు టీకా తీసుకుంటున్నారా లేదా అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు.
ఒహియోలో లాటరీ పద్ధతిలో భారీగా బహుమతులు ప్రకటించినప్పటికీ.. అక్కడ టీకా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బహుమతుల కోసం ప్రజలు టీకా తీసుకుంటారనేది అబద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి భిన్నంగా హాంకాంగ్‌లో ప్రైవేటు రంగం ఆఫర్లను ప్రకటించిన 7 వారాల్లోనే వ్యాక్సిన్ తీసుకునే ప్రజల సంఖ్య రెట్టింపయ్యింది. ఈ విషయం ఒక సర్వేలో వెల్లడి కాగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే ప్రోత్సాహకాలు ప్రకటించడం తప్పనిసరని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. వైద్య నిపుణులు ఎంత చెప్పినా కూడా కొందరు ప్రజలు టీకాలు తీసుకోవడానికి రారని.. అటువంటి వారికోసం బహుమతులు ప్రకటించాల్సిందేనని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business