ధంతేరాస్ సందడి మొదలైంది. ఈ పర్వదినాన్నే ధనత్రయోదశిగా జరుపుకొంటారు. ధంతేరాస్ రోజున బంగారం కొంటే మంచిదన్న సెంటిమెంట్ ఉంటుంది. అందుకే ఈరోజున గోల్డ్ కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనాలని ఆలోచిస్తారు. అందుకే ధంతేరాస్ సమయంలో చిన్నచిన్న నగల షాపుల నుంచి బడా జ్యువెలర్ స్టోర్స్ వరకు అన్నీ కిటకిటలాడుతుంటాయి. ధంతేరాస్ మాత్రమే కాదు దీపావళికి కూడా బంగారం కొనేవాళ్లు ఉంటారు. ఈ సీజన్లో గోల్డ్ కొంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చినట్టేనని భావిస్తారు. అయితే బంగారం కొనేప్పుడు జాగ్రత్తగా లేకపోయినా, అన్నీ సరిగ్గా చూసుకోకపోయినా మోసపోవడం ఖాయం. నగలు కొనేముందు గోల్డ్ హాల్మార్కింగ్ గురించి తెలుసుకోవాలి. నగల షాపులన్నీ హాల్మార్క్ ఉన్న బంగారు ఆభరణాలనే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ రూల్స్ 2020 జనవరిలోనే అమలులోకి వచ్చాయి. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోవడానికి ఏడాది గడువు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2021 జనవరి 15 నుంచి నగల షాపులు సరైన హాల్మార్కింగ్, సర్టిఫికేషన్ లేని ఆభరణాలను అమ్మడానికి వీల్లేదు. ఇక అప్పట్నుంచి 14, 18, 22 క్యారట్ బంగారు ఆభరణాలు, కళాఖండాలను హాల్మార్క్తోనే అమ్మాలి.
బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులపై హాల్మార్క్ ఉండటం అంటే అది స్వచ్ఛతను తెలియజేసే స్టాండర్డ్. అందులో ఎంత శాతం బంగారం ఉందో చెప్పే అధికారిక రికార్డింగ్. చాలా దేశాల్లో హాల్మార్క్ అధికారిక ముద్ర తప్పనిసరి. ఇది ఆభరణాల స్వచ్ఛతను తెలియజేస్తుంది. బంగారంలో స్వచ్ఛత మూడు రకాలుగా ఉంటుంది. 14 క్యారట్, 18 క్యారట్, 22 క్యారట్ అని కనిపించే ముద్రలు బంగారం స్వచ్ఛతను తెలియజేస్తాయి.
బంగారు, వెండి నగలపై హాల్మార్క్ ఎందుకు అవసరం?
బంగారం కొనేప్పుడు కస్టమర్లు మోసపోకూడదని హాల్మార్కింగ్ తప్పనిసరి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల నగల తయారీదారులు మోసాలకు పాల్పడే అవకాశం ఉండదు. ఉదాహరణకు మీరు ఓ షాపులో 22 క్యారట్ ఆభరణాలను కొంటారు. దానిపై ఎలాంటి ముద్ర ఉండదు కాబట్టి అది 22 క్యారట్ గోల్డ్ అని నమ్మేస్తారు. కానీ ఆ షాపు యజమానులు మీకు 18 క్యారట్ ఆభరణాలను అమ్మే అవకాశం ఉంటుంది. 22 క్యారట్ ఆభరణాలతో పోలిస్తే 18 క్యారట్ ఆభరణాల ధర తక్కువ. కానీ మీరు 18 క్యారట్ నగలకు 22 క్యారట్ డబ్బులు చెల్లిస్తారు. ఇక్కడ మీరు మోసపోయినట్టే. అదే ఒకవేళ నగలపై దాని స్వచ్ఛతను సూచించే బీఐఎస్ హాల్మార్కింగ్ ఉంటే మోసపోయే అవకాశం ఉండదు. నగలు తయారుచేసినవాళ్లు వాటిని పరీక్షకు పంపి హాల్మార్కింగ్ వేయాల్సి ఉంటుంది. ఆ నగ 22 క్యారట్తో తయారైతే 22 క్యారట్ హాల్మార్క్ ఉంటుంది. ఒకవేళ 18 క్యారట్తో తయారైతే 18 క్యారట్ హాల్మార్క్ ఉంటుంది. హాల్మార్క్ కనిపిస్తుంది కాబట్టి మీరు స్వచ్ఛతను గుర్తించొచ్చు. మీకు 22 క్యారట్ అని చెప్పి 18 క్యారట్ నగల్ని అంటగట్టేందుకు చూసినా తెలుసుకోవచ్చు. మోసపోకుండా కస్టమర్లను అండగా నిలవడంతో పాటు ఎగుమతుల్ని పెంచడం కోసం హాల్మార్కింగ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.
మీరు ఇప్పటికే కొన్న బంగారానికి మీరు స్వచ్ఛత పరీక్ష చేయించొచ్చు. 915 బీఐఎస్ గుర్తించిన అస్సేయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్లలో మీరు మీ నగల స్వచ్ఛతను తనిఖీ చేయించొచ్చు. భారతదేశంలో 234 జిల్లాల్లో ఈ సెంటర్లున్నాయి. మీరు అక్కడ కేవలం రూ.200 చెల్లించి మీ నగలను పరీక్ష చేయించొచ్చు. తెలంగాణలో 38, ఆంధ్రప్రదేశ్లో 47 బీఐఎస్ గుర్తించిన హాల్మార్కింగ్ కేంద్రాలున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో సెంటర్ల వివరాలను https://bis.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
హాల్మార్క్ లేని బంగారాన్ని కస్టమర్లు అమ్మొచ్చా?
నగల షాపులు హాల్మార్క్ ఉన్న బంగారు నగలనే కస్టమర్లకు అమ్మాలన్న నిబంధనల్ని మాత్రమే విధించింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ కస్టమర్ల దగ్గర హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలు ఉంటే వాటిని అమ్మొచ్చు. నగల షాపులు ఆ ఆభరణాలను కరిగించి 14, 18, 22 క్యారట్ నగలను తయారు చేస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.