Renewable Energy: భారత పునరుత్పాదక ఇంధన రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2030 నాటికి ఈ రంగం 10 లక్షల మందికి ఉపాధి కల్పించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం చిన్న తరహా ఇంధన ప్రాజెక్టుల నుంచే వస్తాయి. ఈ రంగంలో ప్రస్తుతం 1.1 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో 2030 నాటికి ఉపాధి అవకాశాలు 10 రెట్లు పెరుగుతాయని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (CEEW), నేచురల్ రిసొర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (NRDC), స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ (SCGJ) విడుదల చేసేన స్వతంత్ర అధ్యయనం పేర్కొంటోంది. “ఇండియా ఎక్స్ప్యాండింగ్ క్లీన్ ఎనర్జీ వర్క్ ఫోర్స్” పేరుతో విడుదలైన నివేదికలో ఈ అధ్యయనం మరిన్ని వివరాలు పేర్కొంది.
ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు భారీ స్థాయి సోలార్ పార్కుల వంటి వాటి నుంచి కాకుండా చిన్న తరహా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు.. అంటే రూఫ్‌టాప్ సోలార్, మినీ, మైక్రో గ్రిడ్ సిస్టమ్ నుంచి వస్తాయని అధ్యయనం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగ ఉపాధిపై మహమ్మారి ప్రతికూల ప్రభావాన్నీ CEW-NRDC-SCGJ విశ్లేషించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 12,400 మంది కొత్త ఉద్యోగులకు అవకాశాలు కల్పించింది. అయితే ఆర్థిక సంవత్సరం 2020లో ఈ సంఖ్య 5,200కు పడిపోయింది. ఆర్థిక సంవత్సరం 2021లో స్వల్పంగా పెరిగి 6400 కు చేరింది.
ఆర్థిక సంవత్సరం 21లో కొత్త ఉద్యోగాలను రూఫ్‌టాప్ సోలార్ సెగ్మెంట్ అందించింది. ఈ రంగం ఆర్థిక సంవత్సరం 20లో తొమ్మిది శాతానికి పైగా అదనపు సామర్ధ్యం పెంచుకొని 1.4 గిగా వాట్స్ (GW)కు చేరుకుంది. సూర్యమిత్ర శిక్షణ కార్యక్రమం కింద 2015, 2017 మధ్య కాలంలో భారతదేశం 78,000 మందికి విజయవంతంగా శిక్షణ అందించిందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని ద్వారా పరిశుభ్రమైన ఇంధన ప్రాజెక్టులకు నిపుణులైన కార్మికుల అందుబాటు మెరుగుపడిందని తెలిపింది.
భారత్‌లో స్థాపిత సౌరశక్తి సామర్ధ్యం 2014 నుంచి 2021 మధ్య కాలంలో 18 రెట్లు పెరిగింది. 2014లో 2.63 గిగా వాట్ల సామర్ధ్యం ఉండగా అది అక్టోబర్ 2021 నాటికి 47.66 గిగావాట్లకు పెరిగింది. అలాగే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ రహిత వనరుల స్థాపిత సామర్ధ్యం 40 శాతం కంటే ఎక్కువ ఉంది.
రూఫ్‌టాప్, మిని, మైక్రో గ్రిడ్ సిస్టమ్స్ పెంచేందుకు, దేశీయ సౌరశక్తి తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు గరిష్ఠ స్థాయిలో ఉండేలా చూసేందుకు రానున్న కేంద్ర బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ రంగం నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.