మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా? మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందా? అయితే మీ కోసమే ఈ అప్డేట్. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు ఉన్న వారు రేపటి (జూలై 31) లోగా కేవైసీ పూర్తి చేయాలని డిపాజిటరీ సంస్థలు ఇన్వెస్టర్లను కోరాయి. లేకపోతే వారి ఖాతాలను డీయాక్టివేట్ చేస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు- నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సిడిఎస్ఎల్) తాజాగా ఉత్తర్వులు జారీ చేశాయి. కేవైసీలో భాగంగా మీ పేరు, అడ్రస్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్), మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఇన్కమ్ రేంజ్ వంటివి నమోదు చేయాలని తెలిపాయి.
ఇన్వెస్టర్లు తమ కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిపాజిటరీలకు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. స్టాక్ మార్కెట్లో లావాదేవీలకు ఖాతాదారులు తప్పనిసరిగా పాన్ నంబర్ సమర్పించాలని, అలా అయితేనే వారిని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుమతించాలని సర్క్యులర్‌లో పేర్కొంది. ఇన్వెస్టర్లు తప్పనిసరిగా వారి ఆధార్, పాన్ నంబర్‌తో అనుసంధానించాలని కోరింది. ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందా? లేదా? అనే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చని తెలిపింది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన తేదీలోపు మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ చేయకపోతే అది చెల్లుబాటు కాదని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే వారి ఖాతాలను డీయాక్టివేట్ చేస్తామని పేర్కొంది.
జూలై 31లోగా పూర్తి చేయాలి..
అకౌంట్ హోల్డర్లు డిపాజిటరీలకు వారి ఆదాయ పరిధి గురించి తెలియజేయాలి. ఆదాయ పరిధిని బట్టి ఇండివిడ్యువల్, నాన్ ఇండివిడ్యువల్ అని రెండు రకాలుగా ఇన్వెస్టర్లను వర్గీకరించారు. ఇండివిడ్యువల్ ఇన్కమ్ రేంజ్ కింద సంవత్సరానికి రూ. 1 లక్ష కంటే తక్కువ ఆదాయం నుంచి రూ. 25 లక్షల ఆదాయం వరకు మొత్తం ఐదు ఇన్కమ్ స్లాబ్‌లలో వర్గీకరించారు. ఇక, నాన్ ఇండివిడ్యువల్ ఇన్కమ్ రేంజ్ కింద సంవత్సరానికి రూ. 1 లక్ష కంటే తక్కువ నుంచి రూ.1 కోటి కంటే ఎక్కువ ఆదాయం వరకు మొత్తం ఆరు స్లాబుల్లో వర్గీకరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KYC submissionsn