కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ రూల్స్‌పై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఇటీవల కేంద్రప్రభుత్వం డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌ను సోషల్ మీడియా విభాగంలోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ను పాటించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ )2021ని పాటించాలంటూ దివైర్, క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్, ఆల్ట్ న్యూస్ మాతృసంస్థ ప్రావ్దా మీడియా ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం సంస్థలకు కేంద్రం ఇటీవల నోటీసులు జారీ చేసింది.
నిబంధనలు పాటించకుంటే కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐటీ నిబంధనలు రాజ్యంగం ప్రసాదించిన సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14), భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ (ఆర్టికల్ 19 (1) (ఏ)కు వ్యతిరేకమంటూ ఆయా సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. కొత్త ఐటీ రూల్స్ అమలుపై స్టే ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి. అయితే కొత్త ఐటీ రూల్స్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నిత్యా రామకృష్ణ వాదనలు వినిపిస్తూ కేంద్రప్రభుత్వం డిజిటల్ న్యూస్ పోర్టల్స్ ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోందని, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ద్వారా న్యూస్‌ను నియంత్రించాలని భావిస్తోందని వాదించారు. ‘ప్రస్తుత రూల్స్ వల్ల ప్రభుత్వం నేరుగా న్యూస్ రూమ్‌లోకి చొరబడగలదు. వార్తలను నియంత్రించడం, కట్టడి చేయడం, తొలగించడం, సెన్సార్ చేయడం, లేదా క్షమాపణలు చెప్పేలా చేయడం తదితర రూపాలలో ప్రభుత్వం న్యూస్ పోర్టల్స్‌ను తన కనుసన్నలలో నడపాలని చూస్తోంది. ఇది ఆమోదయోగ్యమైన విషయం కాదు. అలాగే డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌ను ప్రింట్ మీడియా కిందకు కాకుండా, సోషల్ మీడియా విభాగంలోకి తీసుకురావడం అక్రమం’ అని వాదించారు.
ఐటీ రూల్స్‌ను పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ జూన్ 18న ప్రభుత్వం హెచ్చరించిందని, కేంద్రప్రభుత్వం న్యూస్ మీడియా కంటెంట్ విషయంలో తీర్పరి పాత్ర పోషించడం తగదని వాదించారు. తాము ప్రభుత్వానికి సహకరిస్తామని న్యూస్ పోర్టల్స్ తెలిపాయని , ఈవిషయంలో ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన పనిలేదని, ప్రభుత్వం వీరి నుంచి ఏమి ఆశిస్తోందో అది ప్రజాక్షేత్రంలో ఉందని నిత్యా రామకృష్ణ కోర్టుకు నివేదించారు.
తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం తప్ప మరోదారి లేదు అని చెప్పారు. ‘వారు మమ్మల్ని బలవంతంగా కేంద్రప్రభుత్వ క్రమశిక్షణా పరిధిలోకి లాగాలని చూస్తున్నారు. ఎందుకంటే జూన్ 18వరకు మాతో మాటామంతీ జరిపిన ప్రభుత్వం హఠాత్తుగా నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు అంటూ హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయడంతోనే మేమీ కోర్టుకు వచ్చాం. అంతకుముందు మేమెప్పడూ కోర్టు తలుపుతట్టలేదు కదా’ అని నిత్యారామకృష్ణ వాదించారు.
అయితే ఈ వాదనతో ఏకీభవించని జస్టిస్ సి హరిశంకర్, జస్టిస్ సుబ్రమణియన్ ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం నోటిఫికేషన్ అమలు చేయాలని మాత్రమే కేంద్రం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నిబంధనల అమలుపై స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT Rules